కలం, వెబ్ డెస్క్: సింగరేణి సంస్థ రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో చేపడుతున్న పవర్ ప్లాంట్ నిర్మాణంలో భారీ అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao) ఆరోపించారు. ఈ ప్లాంట్ ఆలస్యమవుతున్న కొద్దీ ఏడాదికి రూ.750 కోట్ల భారం పడుతోందన్నారు. అంటే రోజుకు సుమారు రూ.రెండున్నర కోట్ల నష్టం వస్తోందన్నారు. తెలంగాణలో ఉన్న ఎన్టీపీసీ అతి తక్కువ ధరకే విద్యుత్తు ఇస్తానంటే.. సింగరేణి సంస్థ ఎక్కడో జైపూర్‌లో ఎందుకు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని ప్రశ్నించారు. డీపీఆర్‌కు ఇంకా తెలంగాణ ప్రభుత్వం అనుమతులే ఇవ్వలేదని, విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందం కూడా జరగకపోయినా టెండర్లు పిలిచినట్లు మండిపడ్డారు.
అనుకున్నవారికే టెండర్లు..
జైపూర్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు తాము అనుకున్నవారికే టెండర్లు కట్టబెట్టారని హరీశ్ రావు మండిపడ్డారు. పైగా ప్లాంట్ పనులు పర్యవేక్షించేందుకు ఆంధ్ర వ్యక్తిని జైపూర్‌లో నియమించారని వివరించారు. మొత్తం ప్రాజెక్టులో తనకు 24 శాతం వాటా ఇస్తున్నందుకు రాజస్థాన్ ప్రభుత్వం పాకిస్థాన్ సరిహద్దుల్లోని జైసల్మేర్‌లో 1400 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించిందన్నారు. తెలంగాణను వదిలేసి.. ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో సింగరేణి సోలార్ ప్లాంట్ పెట్టడం దేనికని.. ఎవరి ప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు.

