కలం, నాగగర్జునసాగర్: నాగార్జునసాగర్ (Nagarjunasagar) సందర్శించే సందర్శకుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని నాగార్జునసాగర్ విజయపురి నార్త్ ఎస్ఐ సతీష్ (SI Satish) తెలిపారు. నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ వనం ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర ఆయనకు బుద్ధ వనం విశేషాలను తెలిపి, బుద్ధ వనం కండువాలతో, బ్రోచర్లతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సతీష్ మాట్లాడుతూ.. నాగార్జునసాగర్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా విధులు చేపట్టిన నాటి నుండి అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ లో పర్యాటక ప్రాంతాలపై అవగాహన కోసం బుద్ధ వనాన్ని సందర్శించామని తెలిపారు.
నాగార్జునసాగర్‌లోని ఏ ఏ ప్రాంతాల్లో సందర్శకుల సందడి నెలకొని ఉంటుంది, ఎంత మేరకు పర్యాటకులు ఏ సీజన్‌లో సాగర్‌ని ఎక్కువ సందర్శిస్తారు అనే విషయాలను పూర్తిగా తెలుసుకుంటున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ లాంటి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంలో సందర్శకులు తమ ఎంజాయ్‌మెంట్ కంటే ముందు సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పోలీస్ అధికారులు సూచించే భద్రతా చర్యలను తప్పక పర్యాటకులు పాటించాలని సూచించారు. త్వరలో టూరిస్ట్ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో సందర్శకుల భద్రత కోసం ఉన్నత అధికారుల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా బుద్ధ వనంలో పర్యాటకుల భద్రత కోసం టూరిజం ఆధ్వర్యంలో నలుగురు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

