కలం, స్పోర్ట్స్ : టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కొత్త టెక్నాలజీతో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో ప్రాక్టీస్ చేస్తూ.. నుదుటిపై ‘టెంపుల్’ అనే ఫిట్‌నెస్ పరికరాన్ని ధరించాడు. ఇంకా మార్కెట్లోకి రాని ఈ పరికరం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. డీపిందర్ గోయల్ రూపొందించిన ఈ పరికరం నుదుటిపై కళ్లకు కొద్దిగా పైన అమర్చుకుంటారు. శరీరంపై పనిభారం పెరిగినప్పుడు మెదడులో రక్తప్రసరణ, నాడీ వ్యవస్థ స్పందనలు, మానసిక ఒత్తిడి స్థాయులను అంచనా వేయడానికి ఇది ఉపయోగపడుతుందని సమాచారం. అయితే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఫిట్‌నెస్ పరికరాలతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ప్రాక్టీస్‌కు ముందు గిల్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో జట్టు సన్నాహాలపై చర్చించాడు. ఆ తర్వాత ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌తో కలిసి నెట్స్‌లో బ్యాటింగ్ చేశాడు. ఈ పరికరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నాడనే విషయంపై గిల్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఇక భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ నవంబర్ 4న ప్రారంభం కానుంది. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే ఆక్లాండ్‌కు చేరుకోగా, విరాట్ కోహ్లీ కూడా త్వరలో జట్టుతో కలవనున్నాడు. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో, న్యూజిలాండ్ పర్యటనను భారత్ కీలక సన్నాహకంగా భావిస్తోంది.

