ధాన్యం అమ్మకాలపై ఆందోళన వద్దు.. రైతులకు ఎమ్మెల్యే భరోసా

కలం, కరీంనగర్ బ్యూరో: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (MLA Kavvampally Satyanarayana) స్పష్టం చేశారు. ధాన్యం అమ్మకాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట, మహాత్మానగర్ గ్రామాల్లో హాకా, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అవసరమైన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందన్నారు. ధాన్యం సేకరణకు అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. రైతులందరూ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్న వడ్లకు బోనస్‌ తప్పకుండా అందజేస్తామని, ఈ విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని స్పష్టం చేశారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.

24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ

ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో చెల్లింపులు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూస్తామని పేర్కొన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, తహశీల్దార్ కె. శ్రీనివాస్ రెడ్డి, నుస్తులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ మోరపల్లి రమణారెడ్డి, పోరండ్ల పీఏసీఎస్ చైర్మన్ గోపు తిరుపతిరెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు ఎలుక ఆంజనేయులు, పొన్నాల సంపత్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండారి రమేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు ఎలుక రాజు, అంకూస్, కాంగ్రెస్ నాయకులు గంకిడి లక్ష్మారెడ్డి, గోపు మల్లారెడ్డి, మామిడి అనిల్ కుమార్, పులి కృష్ణ, కుంట రాజేందర్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, కొత్త తిరుపతిరెడ్డి, రెడ్డిగాని రాజు, తమ్మనవేణి రాములు యాదవ్, కేతిరెడ్డి ఎల్లారెడ్డి, అయితం వెంకన్న, రాచపల్లి దుర్గాప్రసాద్, పోలు రాము, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>