కలం, స్పోర్ట్స్: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా కెప్టెన్ వ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) సరికొత్త చరిత్ర సృష్టించాడు. డర్హమ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అర్ధశతకం సాధించి, ఇంగ్లండ్‌లో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఫిఫ్టీ చేసిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో అయ్యర్ 48 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా అతనికి ఇది తొలి టీ20 అంతర్జాతీయ అర్ధశతకం కూడా. అలాగే ఇంగ్లండ్‌లో భారత కెప్టెన్‌గా టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
గతంలో 2018లో కార్డిఫ్‌లో ఇంగ్లండ్‌పై విరాట్ కోహ్లీ చేసిన అజేయ 47 పరుగుల రికార్డును అయ్యర్ అధిగమించాడు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను 0-2తో కోల్పోయిన తర్వాత భారత జట్టు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగింది. అయితే ఆరంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. తొలి రెండు ఓవర్లలోనే సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ అవుట్ కావడంతో జట్టు 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితిలో అభిషేక్ శర్మ వేగంగా ఆడుతూ కేవలం 27 బంతుల్లో 59 పరుగులు చేశాడు.
మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) ఓపికగా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించి జట్టును గాడిలో పెట్టారు. అయ్యర్ 38 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత వేగం పెంచి ఆకట్టుకునే బౌండరీలు, భారీ సిక్స్‌తో స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. చివరకు సాకిబ్ మహ్మూద్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగే సమయానికి 68 పరుగులు చేశాడు. చివర్లో శివమ్ దూబే 42 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
అయితే ఇన్నింగ్స్ విరామం సమయంలో వర్షం కొనసాగడంతో ఇంగ్లండ్ తన ఛేజ్‌ను ప్రారంభించే అవకాశం రాలేదు. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మ్యాచ్ ఫలితం తేలకపోయినా, శ్రేయాస్ అయ్యర్ ఆడిన ఇన్నింగ్స్ భారత్‌కు పెద్ద ఊరటనిచ్చింది. అలాగే ఇంగ్లండ్‌లో భారత కెప్టెన్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతూ మరో మైలురాయిని తన ఖాతాలో వేసుకున్నాడు.

