కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఫ్యామిలీ మర్డర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి పోస్ట్‌మార్టం నివేదికలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు పక్కా ప్రొఫెషనల్ కిల్లర్స్ లాగా దారుణానికి ఒడిగట్టినట్లు పోస్టుమార్టం నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. హంతకులు నలుగురినీ ఒకే శైలిలో హతమార్చడం పలు అనుమానాలకు తావిస్తోంది. మృతులందరినీ మెడ, ఛాతి భాగాల మధ్యలోనే పదునైన ఆయుధాలతో నరికి చంపినట్లు వైద్యులు గుర్తించారు.
అయితే మృతుడు షేక్ సుల్తాన్ కుమారుడు ముజామిల్‌కు కరాటే వచ్చు. తల్లిదండ్రులపై దాడి జరుగుతున్న సమయంలో అతను ఎదురుతిరిగి ఉంటాడని, అందుకే కక్షపూరితంగా అతనిపై ఏకంగా 16 సార్లు కత్తితో పొడిచి చంపారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు, అన్నయ్యపై దాడి జరుగుతుంటే భయపడి మంచం కింద తలదాచుకున్న 8వ తరగతి చదువుతున్న చిన్నారి అప్సరాను దుండగులు జుట్టు పట్టుకుని బయటకు లాగి మరి అత్యంత క్రూరంగా చంపేశారు. భార్యాభర్తలు సుల్తాన్, హసీనాల ఒంటిపై నాలుగేసి కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారు.
తెల్లవారుజామునే దారుణం
సుల్తాన్ కుటుంబం ఊరి చివర ఒంటరిగా నివసిస్తోంది. చుట్టుపక్కల వారితో వీరికి పెద్దగా సంబంధాలు లేవు. నిందితులు ముందుగానే ఇక్కడ రెక్కి నిర్వహించి, తెల్లవారుజామున సుమారు 4 గంటల ప్రాంతంలో హసీనా వాష్‌రూమ్ కోసం తలుపు తీసిన తరుణంలో ఇంట్లోకి చొరబడి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. వీరి ఇంట్లోనే ఉన్న ఒక పదునైన ఇనుప చువ్వను కూడా హత్యకు ఉపయోగించినట్లు వేలిముద్రల ద్వారా ఆధారాలు లభించాయి.
హంతకులు ఎటువంటి వాహనాలు వాడకుండా కాలి నడకనే వచ్చి ఉంటారని, వారు 4 నుండి 5 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాలనీ చివరన సీసీ కెమెరాలు లేకపోవడంతో పోలీసులకు ఎలాంటి సీసీపుటేజీ లభించడం లేదు. ఇది దోపిడీ దొంగల పనా..? లేక పాత కక్షలతో ఎవరైనా సుపారీ ఇచ్చి చేయించారా..? అనే కోణంలో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు హసీనాకు గతంలో రెండు పెళ్లిళ్లు కాగా, సుల్తాన్ ఆమెకు మూడో భర్త. ఈ నేపథ్యంలో ఆమె మాజీ భర్తలను కూడా పిలిపించి పోలీసులు విచారించారు.
అలాగే కొడుకు ముజామిల్ స్నేహితులు, హసీనా పని చేసే స్కూల్ యాజమాన్యాన్ని సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ కేసు జిల్లా పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారింది. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా హంతకుల జాడ కనుగొనలేకపోవడం స్థానిక నిఘా, దర్యాప్తు విభాగాల అసమర్థతను ఎత్తిచూపుతోంది. డీజీపీ స్థాయి అధికారి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రగతి శూన్యంగా ఉండటం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో కాలనీ చివర సీసీ కెమెరాలు లేకపోవడమే పోలీసులకు పెద్ద మైనస్‌గా మారింది.

