కలం, స్పోర్ట్స్: బాల్ ట్యాంపరింగ్ (Ball Tampering) విషయంలో పాకిస్థాన్ కూడా మినహాయింపు కాదని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) వ్యాఖ్యానించాడు. గతంలో తమ జట్టు కూడా ఇంగ్లండ్‌లో బాటిల్ క్యాప్స్‌తో బంతిని ట్యాంపరింగ్ చేసిందని వెల్లడించాడు. 2018లో ఆస్ట్రేలియాను కుదిపేసిన శాండ్‌పేపర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అక్తర్ ఈ విషయాలను ప్రస్తావించాడు. ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లందరికీ బాల్ ట్యాంపరింగ్ గురించి తెలుసని ఖవాజా తన పుస్తకం సబ్ర్‌లో పేర్కొన్నాడు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన అక్తర్ (Shoaib Akhtar).. ఖవాజా చెప్పిన దాంట్లో నిజం ఉండే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ఇది ఒకరిద్దరు ఆటగాళ్ల నిర్ణయం మాత్రమే కాకుండా, జట్టులోని అందరికీ తెలిసి జరిగి ఉండొచ్చని అన్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ శాండ్‌పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమెరాకు చిక్కాడు. ఈ ఘటన క్రికెట్ ప్రపంచంలో తీవ్ర కలకలం రేపింది. అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంది. అయితే, విచారణలో ఈ ముగ్గురినే బాధ్యులుగా తేల్చారు.
Also Read : న్యూజిలాండ్ టెస్ట్.. సిరాజ్ స్థానంపై కోచ్ కామెంట్స్
Follow Us On: Youtube

