ఆసియా U23 అథ్లెటిక్స్: శివాజీకి రజతం!

క‌లం, వెబ్ డెస్క్‌: చైనాలోని ఓర్డోస్‌లో జరుగుతున్న తొలి ఆసియా U23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ (Asian U23 Athletics Championships)లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. శనివారం జరిగిన పోటీల్లో భారత్‌కు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు దక్కాయి. దీంతో భారత పతకాల సంఖ్య 11కి చేరింది. ఈ టోర్నీలో భారత పరుగు వీరుడు శివాజీ పరశురామ్ మరోసారి మెరిశాడు. టోర్నీ మొదటి రోజే 5,000 మీటర్ల పరుగు పందెంలో రజతం గెలిచిన శివాజీ, శనివారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేసులోనూ రెండో రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ రేసులో అతను 29 నిమిషాల 33.54 సెకన్లలో లక్ష్యాన్ని చేరి తన వ్యక్తిగత అత్యుత్తమ రికార్డును నమోదు చేశాడు. కాగా, ఈ పోటీలో జపాన్‌కు చెందిన యోషిహిరో కుసుఓకా పసిడి పతకాన్ని గెలవగా, చైనా రన్నర్ జింఝీ జియాంగ్ కాంస్యం సాధించాడు. ఇదే రేసులో పాల్గొన్న మరో భారత అథ్లెట్ శైలేష్ కుష్వాహా నాల్గో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆ తర్వాత జరిగిన మహిళల డిస్కస్ త్రో పోటీల్లో భారత అథ్లెట్ ప్రియ కాంస్య పతకం సాధించింది.

ఆమె తన మూడో ప్రయత్నంలో డిస్కస్‌ను 50.44 మీటర్ల దూరం విసిరి ఈ విజయాన్ని అందుకుంది. ఈ ఈవెంట్‌లో చైనాకు చెందిన జిచావో జియాంగ్ బంగారు పతకాన్ని, జింగ్రూ హువాంగ్ వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు రెండో కాంస్యం లభించింది. శ్రావణి సచిన్ సాంగ్లే 58.09 సెకన్లలో రేసును ముగించి మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీలో తైపీకి చెందిన హ్సిన్ జు చుంగ్ స్వర్ణం, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన నూర్ఖోన్ ఒచిలోవా రజతం గెలుచుకున్నారు.

ఇక శనివారం జరిగిన మిగిలిన పోటీల్లో భారత అథ్లెట్లు పతకాలకు కొద్ది దూరంలో నిలిచారు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో శ్రీయ రాజేష్ నాల్గో స్థానంలో, సబితా టొప్పో ఆరో స్థానంలో నిలిచారు. పురుషుల లాంగ్ జంప్‌లో మొహమ్మద్ అట్టా సాజిద్ ఐదో స్థానాన్ని అందుకున్నాడు. మహిళల షాట్‌పుట్‌లో అనుప్రియ నాల్గో స్థానంతో పతకాన్ని చేజార్చుకోగా, పురుషుల 400 మీటర్ల పరుగులో ఆస్తిక్ ప్రధాన్ ఐదో స్థానంలో, సేతు మిశ్రా ఏడో స్థానంలో రేసును ముగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>