కలం, ఖమ్మం బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో సామాన్యుడిపై భారం మోపుతుంటే, స్థానిక గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది అంతకు మించి అక్రమ వసూళ్లతో వినియోగదారుల నడ్డి విరుస్తున్నారు. బిల్లులో ఉన్న ధర ఒకటి, గేటు దాటాక వసూలు చేసే ధర మరొకటి అన్న చందంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో బహిరంగ దోపిడీ (Illegal LPG Gas Delivery) సాగుతోంది. నిబంధనల ప్రకారం గ్యాస్ ఏజెన్సీ కేంద్రం నుంచి 15 కిలోమీటర్ల పరిధి లోపు ఉన్న వినియోగదారులకు ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సిలిండర్‌ను ఉచితంగా డెలివరీ చేయాలి. కానీ, ఈ నియమం ఎక్కడా అమలు కావడం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కేంద్రంగా నడిచే శ్రీ సాయి భారత్ గ్యాస్ ఏజెన్సీ పరిధిలోని లచ్చాపురం గ్రామం కేవలం 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, అక్కడ ఒక్కో వినియోగదారుడి నుంచి బిల్లులో ఉన్న రూ. 981 కాకుండా, సర్వీస్ ఛార్జ్ పేరుతో ఏకంగా రూ. 1,050 వసూలు చేస్తున్నారు. అంటే ఆన్‌లైన్ బిల్లులో చూపించకుండానే రూ. 79 నేరుగా జేబులో వేసుకుంటున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే, ఇది అందరి దగ్గర తీసుకునేదేనని, సమస్య ఉంటే ఏజెన్సీ కార్యాలయంలో లేదా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసుకోవచ్చంటూ డెలివరీ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానాలు ఇస్తుండటం గమనార్హం. అలాగే మణుగూరు కేంద్రంగా నిర్వహిస్తున్న సింగరేణి గ్యాస్ ఏజెన్సీ కూడా సర్వీస్ ఛార్జ్ పేరుతో రూ.60 నుంచి రూ. 100 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గిరిజన ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా..
ఈ దోపిడీకి ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజల అమాయకత్వమే పెట్టుబడిగా మారుతోంది. పట్టణాల్లో ఆన్‌లైన్ బుకింగ్‌లు, డిజిటల్ చెల్లింపులపై అవగాహన ఉండటం వల్ల డెలివరీ బాయ్స్ రూ. 20 నుండి రూ. 30 తో సరిపెడుతుండగా, పల్లెల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఓటీపీ విధానం, మొబైల్ బుకింగ్స్ తెలియని అమాయక ప్రజల ఫోన్లు, గ్యాస్ పుస్తకాలను డెలివరీ సిబ్బంది తామే దగ్గరుండి ఆపరేట్ చేస్తూ ఎంత అడిగితే అంత వసూలు చేస్తున్నారు. అడిగిన వారికి కొంత తగ్గించి, నోరు విప్పని అమాయకుల నుండి రూ. 100 నుండి రూ. 120 వరకు అదనంగా గుంజుతున్నారు.
ఇటీవల ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాలో ఒక్కో సిలిండర్‌పై రూ. 120 అదనంగా వసూలు చేస్తుండటాన్ని గమనించిన గ్రామస్థులు తిరగబడి, గ్యాస్ వాహనాన్ని అడ్డుకుని అధికారులకు అప్పగించడమే ఇందుకు సజీవ సాక్ష్యం. ఇటు గృహ వినియోగదారులను ముంచుతూనే, అటు డొమెస్టిక్ సిలిండర్లను హోటళ్లు, రెస్టారెంట్లకు అక్రమంగా తరలిస్తూ ఏజెన్సీలు డబుల్ లాభాలు గడిస్తున్నాయి. కమర్షియల్ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండటంతో, హోటల్ నిర్వాహకులకు గృహ వినియోగ సిలిండర్లను సప్లై చేస్తూ, ఒక్కో సిలిండర్‌పై అదనంగా రూ. 500 నుండి రూ. 800 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59 గ్యాస్ ఏజెన్సీలు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 59 గ్యాస్ ఏజెన్సీలు, 10 లక్షలకు పైగా ఎల్‌పీజీ కనెక్షన్లు ఉన్నాయి. సగటున ఒక కుటుంబం ఏడాదికి 6 సిలిండర్లు వాడుతుందని అంచనా వేసినా, ఈ అదనపు వసూళ్ల వల్ల ఒక్కో కనెక్షన్ పై ఏడాదికి రూ. 350 నుండి రూ. 600 వరకు అదనపు భారం పడుతోంది. అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సుమారు 35 నుంచి 60 కోట్ల రూపాయల భారం పడుతుంది. ఇంత భారీగా, బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా, దీనిని అరికట్టాల్సిన పౌరసంబంధాల శాఖ గానీ, రెవెన్యూ అధికారులు గానీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టకపోవడం వల్లే ఏజెన్సీల ఆగడాలు మితిమీరుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో స్పందించి, నిరంతర నిఘా ఉంచి, అక్రమ వసూళ్లకు పాల్పడే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
ప్రేమ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ప్రభుత్వం నిర్ణయించిన నిర్దేశిత ధర కంటే ఒక్క రూపాయి అదనంగా అడిగినా ఇవ్వకూడదు. అక్రమ వసూళ్లకు పాల్పడితే మండల తహసీల్దార్లకు లేదా జిల్లా పౌరసరఫరా అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఆన్లైన్ లో ఎంత ధర చూపిస్తుందో అంతే చెల్లించాలి. అందులో డెలివరీ ఛార్జ్ కూడా కలిసే ఉంటుంది. ఒకవేళ వినియోగదారులు గోడౌన్ కు వెళ్ళి తెచ్చుకుంటే ఆన్లైన్ లో చూపించే ధర లో డెలివరీ ఛార్జ్ మినహాయింపు చేయవచ్చు.

