Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండ జిల్లాలో తీవ్ర ఇంధన కొరత

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఇంధన కొరత (Fuel Shortage) తీవ్ర రూపం దాల్చుతోంది. గత రెండు మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొరత సెగ సామాన్యుల నుంచి రైతుల వరకు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అడ్వాన్స్‌గా డబ్బులు చెల్లించినప్పటికీ స్టాక్ అందకపోవడం ఒక సమస్యగా మారగా, పొరుగు రాష్ట్రాల వాహనాల రద్దీ కారణంగా ఉన్న నిల్వలు సైతం వెంటనే ఖాళీ అవుతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలు, సరిహద్దు ప్రాంతాలలోని దాదాపు 80 శాతం పెట్రోల్ బంకులలో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ నుంచి భారీగా వాహనాలు తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన కోదాడ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ మీదుగా రావడంతో ఇక్కడి స్టాక్ వేగంగా అయిపోతోంది (Fuel Shortage). ట్యాంకర్‌లు వచ్చినా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఒక్క రోజులోనే ఇంధనం ఖాళీ అవుతోంది. ప్రస్తుతం వరి కోతల సీజన్ కావడంతో డీజిల్ అవసరం మరింత పెరిగింది. హార్వెస్టర్లకు ఇంధనం లేకపోవడంతో పొలాలలో  కోతలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి.

ఏపీ వాహనదారులు కూడా తెలంగాణ సరిహద్దు బంకులపై ఆధారపడటంతో స్థానిక అవసరాలకు కేటాయించిన కోటా త్వరగా ఖాళీ అవుతోంది. పెట్రోల్ కొంతమేర అందుబాటులో ఉన్నా, ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజులలో పెట్రోల్ కూడా కొరతకు గురయ్యే అవకాశం ఉందని బంక్ నిర్వాహకులు హెచ్చరిస్తున్నారు. వలిగొండ మండలంలో కూడా డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. మూడు పెట్రోల్ బంకులలో డీజిల్ పూర్తిగా ఖాళీ కావడంతో వాహనదారులు ఇతర గ్రామాల బంకుల వద్దకు పరుగులు తీశారు. హార్వెస్టర్లు ఇంధనం లేక ఆగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వ్యవసాయ పనులు, రవాణా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేసి ఇంధన సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

 Read Also: డ్రగ్స్ కేసులో ఎవరినీ వదలిపెట్టం: సీఎం రేవంత్ రెడ్డి

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>