కలం, ఖమ్మం బ్యూరో: జనగణన ప్రక్రియలో భాగంగా ప్రజలు వివరాలు సేకరించే సిబ్బంది కోసం ఎదురు చూడాల్సిన పని లేదని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానాన్ని ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని జిల్లా యంత్రాంగం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు నిర్వహించనున్న సెల్ఫ్ ఎన్యూమరేషన్ కార్యక్రమంపై శనివారం కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌తో కలిసి, భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా కలెక్టర్ అంకిత్ (Collector Ankit) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంప్రదాయ విధానంలో ఇంటింటికీ వచ్చే గణన అధికారుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా, ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ఆన్‌లైన్ ద్వారా తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ విధానం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు ఖచ్చితమైన సమాచారాన్ని అందించే అవకాశముంటుందని తెలిపారు .
సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, విద్య, ఉపాధి, ఆస్తులు, వంటి కీలక సమాచారాన్ని ప్రజలు స్వయంగా నమోదు చేయడం వల్ల తప్పులు దొర్లే అవకాశం తగ్గుతుందని తెలిపారు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా అధికారిక వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేయడం వల్ల గోప్యత మరింత భద్రంగా ఉంటుందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి నమోదు చేసిన డేటా వేగంగా, సురక్షితంగా భద్రపరచ బడుతుందని వివరించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ నమోదు ప్రక్రియను వివరిస్తూ, ప్రభుత్వం ప్రకటించిన అధికారిక వెబ్‌సైట్ https://se.census.gov.in లోకి వెళ్లి మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌తో లాగిన్ అవ్వాలని తెలిపారు. తదుపరి తెలుగు లేదా అనుకూలమైన భాషను ఎంపిక చేసుకుని, మ్యాప్‌లో నివాసాన్ని జియో-ట్యాగ్ చేసి, గృహ, కుటుంబానికి సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేయాలన్నారు. వివరాలను సరిచూసుకుని సబ్మిట్ చేసిన తర్వాత మొబైల్‌కు వచ్చే SE ID ను భద్రపరచుకుని, ఇంటింటి సర్వేకు వచ్చే గణాంక సిబ్బందికి చూపించాలని సూచించారు.
ప్రతి కుటుంబం ఒక మొబైల్ నంబర్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని, ఈ సేవ పూర్తిగా ఉచితమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేయలేని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గణాంక సిబ్బంది నేరుగా ఇంటికి వచ్చి వివరాలు సేకరిస్తారని తెలిపారు. జనగణన దేశాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రక్రియగా పేర్కొంటూ, ప్రజలు అందించే ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించ బడతాయని కలెక్టర్ వివరించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

