కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేతో జరగనున్న కీలక మ్యాచ్‌కు భారత్ సిద్ధమవుతోంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ ఈ పోరులో కచ్చితంగా గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌ను తిరిగి తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ (Sehwag) సూచించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్‌ను పక్కన పెట్టారు. అతని స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే సుందర్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లోనూ ప్రభావం చూపలేకపోయారు.
దీనిపై సెహ్వాగ్ స్పందిస్తూ అక్షర్ పటేల్‌ను జట్టులోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ను కోరారు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ సరైన ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డారు. జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందు భారత్ పలు సమస్యలను ఎదుర్కొంటోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ల ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. రింకూ సింగ్ అందుబాటుపై ఇంకా స్పష్టత రాలేదు. జట్టు కూర్పుపై మేనేజ్‌మెంట్ సందిగ్ధంలో ఉంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో గురువారం భారత్, జింబాబ్వే తలపడనున్నాయి.
గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సికందర్ రజా నేతృత్వంలోని జింబాబ్వేపై గెలిచి పాయింట్ల ఖాతా తెరవాలని భారత్ భావిస్తోంది. జింబాబ్వే తన గత ఓటమిని గుర్తుంచుకుంటే, భారత్ చేతిలో కూడా పరాజయం పాలవుతుందని సెహ్వాగ్ (Sehwag) పేర్కొన్నారు. సూపర్-8 పాయింట్ల పట్టికలో వెనుకబడిన భారత్, ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ రేసులో నిలవాలని చూస్తోంది. తుది జట్టులో మేనేజ్‌మెంట్ ఎలాంటి మార్పులు చేస్తుందో వేచి చూడాలి.

