Mobile Popup Ad
Mobile Popup Ad

వర్కింగ్ ఉమెన్ హాస్టల్, సఖి కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క

కలం, వెబ్ డెస్క్: సంపద సృష్టించే శక్తిగా మహిళలను తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క (Seethakka) స్పష్టం చేశారు. మహిళల ఆదాయం పెరిగితే కుటుంబం బలపడుతుందని, రాష్ట్రం సంపన్నమవుతుందని చెప్పారు. మహిళా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్-12లో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ “సఖి నివాస్”, వన్ స్టాప్ సెంటర్ సఖి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చే మహిళలకు సురక్షిత వసతి కల్పించేందుకు ప్రభుత్వం వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను (Working Women Hostel) ఏర్పాటు చేస్తోందని చెప్పారు. ఈ హాస్టల్‌లో సుమారు 150 మంది మహిళలకు వసతి సౌకర్యం కల్పించామని తెలిపారు. చిన్న పిల్లలతో వచ్చే తల్లులు కూడా ఇక్కడే బస చేసే విధంగా వసతులు ఏర్పాటు చేశామన్నారు.

రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు..

మహిళా సంఘాలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాల పరిమితిని పెంచిందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళల భద్రత, గౌరవం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. మహిళా అభ్యున్నతిని ఓర్చుకోలేని విపక్షాలకు మహిళలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మహిళా సంఘాలకు రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, మహిళా సూపర్ మార్కెట్లు వంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు ఖర్చులకోసం కోసం ఇతరులను ఆశ్రయించే స్థితి నుంచి.. ఇప్పుడు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలను తీసుకెళ్తున్నామని అన్నారు.

భట్టి విక్రమార్క చేతుల మీదుగా..

మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లను బుధవారం ప్రారంభించనున్నామని సీతక్క తెలిపారు. మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. జూన్ 5న మహిళలకు ఆర్టీసీ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారని వెల్లడించారు. గ్రామ గ్రామాన మహిళలు సాధిస్తున్న విజయాలను సమాజానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, చైల్డ్ కమిషన్ చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డి, చైల్డ్స్ రైట్స్ కమిషన్ సభ్యులు బండి అపర్ణ, వందన గౌడ్ మరిపల్లి చందన, సరిత, ప్రేమ్ లత అగర్వాల్, ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>