Mobile Popup Ad
Mobile Popup Ad

రేపు సీఎం పర్యటన.. భద్రతా ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

కలం, నాగర్ కర్నూల్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఉర్కొండపేట (Urkondapeta) శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేసిందని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ (Hemanta Keshav Patil) తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, సీఎం భద్రతా విభాగం ఉన్నతాధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులు, జిల్లా స్థాయి అధికారులతో కలిసి ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం..

హెలిప్యాడ్, ఆలయ ప్రాంగణం, ముఖ్యమంత్రి సభా వేదిక, ప్రజల రాకపోకల మార్గాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ ప్రయాణ మార్గం, భద్రతా పాయింట్లను స్వయంగా తనిఖీ చేసి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి భద్రతా విభాగం ఆధ్వర్యంలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాఖల వారీగా సమీక్షించారు. ముఖ్యమంత్రి ప్రయాణ మార్గం నుంచి కార్యక్రమం ముగిసే వరకు అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, అత్యవసర సేవలు, వైద్య బృందాల మోహరింపు, అగ్నిమాపక సన్నద్ధత, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం, కమ్యూనికేషన్ వ్యవస్థ, ప్రజా రద్దీ నియంత్రణ వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రతి శాఖకూ బాధ్యతలు..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ప్రతి శాఖకు బాధ్యతలు అప్పగించామని, భద్రత విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యానికి తావులేదని, ప్రతి అధికారి తన బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని, చిన్నచిన్న అంశాలను కూడా విస్మరించకుండా పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాన్వాయ్ ప్రయాణించే మార్గమంతా పటిష్ట భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికను సిద్ధం చేశామని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను మోహరించినట్లు వివరించారు.

ముఖ్యమంత్రి భద్రతా విభాగం తరఫున అదనపు ఎస్పీ చి. వాసుదేవ రెడ్డి, డీఎస్పీలు ఎ. శ్రీధర్ రెడ్డి, డి. కృష్ణ ఏఎస్‌ఎల్‌లో పాల్గొని స్థానిక యంత్రాంగంతో కలిసి భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. భద్రతా ప్రణాళికను అమలు చేసే విధానంపై సంబంధిత అధికారులకు పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అరుణా రెడ్డి, దేవ సహాయం, కల్వకుర్తి ఆర్డీవో జనార్దన్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, విద్యుత్, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, ఆర్ అండ్ బీ, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు, ఆలయ ఈవోతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>