విద్యారంగ సమస్యలపై బంద్ విజయవంతం

కలం, జోగులాంబ గద్వాల: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న విద్యారంగ సమస్యలను (Education Issues) పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. వామపక్ష విద్యార్థి సంఘాల కమిటీ పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ (Education Protest) జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లాలో విజయవంతమైంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా మూతపడ్డాయి.

ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, ప్రభుత్వ విద్య పరిరక్షణ కోసం ప్రజలు చూపిన ఐక్యత ప్రభుత్వానికి హెచ్చరికగా నిలిచిందని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.10,500 కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకే పరిమితం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు, లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 7, 8, 9లను రద్దు చేయడంతో పాటు విద్యార్థి సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు. అలాగే జిల్లాలో బంద్‌కు సహకరించని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఆందోళనలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షులు హాలింపాష, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు భరత్, పీడీఎస్‌యూ నాయకులు హరీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రవీణ్, పీడీఎస్యూ నాయకులు చందు పాషా, గజేంద్ర, శివకుమార్, తిరుమలేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లేష్, భీమరాజు, గంగాధర్, శరత్, సురేందర్, శివ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>