కలం, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుంచి స్కూళ్లు రీ ఓపెన్ అవుతున్నాయి. విద్యార్థుల ప్రయాణ భద్రతకు అత్యంత కీలకమైన బడి బస్సుల (School Bus) ఫిట్‌నెస్ పై తల్లిదండ్రులను ఆందోళన కలిగిస్తున్నాయి. బస్సుల సామర్థ్య పరీక్షలను కొన్ని జిల్లాలో మాత్రమే నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారు. మరికొన్ని జిల్లాలో ఫైర్‌సేఫ్టీ, టైర్ల ఇతర పరీక్షల వంటివాటిపై కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి బస్సు కండీషన్‌ను స్వయంగా అధికారులు నడిపి చూడాల్సి ఉండగా.. కొన్నింటినే నడుపుతూ మిగతావాటిని బస్సు డ్రైవర్లతో నడిపిస్తున్నారు. కొందరు అవినీతి అధికారుల కారణంగా సామర్థ్యం లేని బస్సులు నడుపుతున్న యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరిట బస్సుల ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించి కాలం చెల్లిన బస్సులను నిలువరించాలనే డిమాండ్లు తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రైవేట్ బస్సుల ఫిట్ నెస్ టెస్టులపై ఆర్టీఏ చేపట్టిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొనసాగిస్తున్న ఆర్టీఏ
ఉమ్మడి నిజామాబాబాద్ జిల్లాలో ఆర్టీఏ (RTA) ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని, రూల్స్ పాటించని స్కూల్ బస్సులు, వ్యాన్లపై సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో మొత్తం 806 స్కూల్ బస్సులు ఉండగా, 648 బస్సులకు ఫిట్ నెస్ టెస్ట్ పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 277 బస్సులకు 190 బస్సులు చేయించుకోగా.. మిగతా బస్సులకు కూడా పరీక్షలు త్వరలో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. రూల్స్ మేరకు స్కూల్ బస్సులు రోడ్లపైకి రావాల్సి ఉంటుంది. జిల్లాలో మొబైల్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. ఎంవీఐ, ముగ్గురు ఏఎంవీఐలు, ఇద్దరు హోంగార్డులతో టీమ్ నిత్యం తనిఖీలు చేస్తుంది. ఉమ్మడి జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల బస్సులను ఆర్టీఏ, పోలీస్ అధికారులు సంయుక్తగా తనిఖీలు చేస్తారు. ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, డ్రైవర్ లైసెన్స్, బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ ఎగ్జిస్టింగర్, ఎమర్జెన్సీ డోర్ వంటి వివరాలు పరిశీలిస్తామని, రూల్స్ పాటించని బస్సులను సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.
గతంలో పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులు ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉండగా.. ఈసారి ముందస్తు చర్యలు చేపట్టారు. అయితే.. ఈసారి 50 శాతం మంది శిక్షణ పొందిన డ్రైవర్లు ఉండగా మిగతా వారు ఎప్పటికప్పుడు ఉపాధి కోసం నేర్చుకున్న వారే. లేదా అప్పటికే చేస్తున్న డ్రైవర్ల బంధువులు ఫ్రెండ్స్, తెలిసిన వారు రికమండేషన్ తో వస్తున్నారు. దీంతో నైపుణ్యం డ్రైవింగ్ చేయక గతంలో పలు ప్రమాద సంఘటనలు జరిగాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు, సిటీలోనూ చిన్న స్కూల్స్ వాళ్లు కూడా పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని నిజామాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి రమేష్ రాథోడ్ తెలిపారు. ఫిట్ నెస్ లేనివి నడపకూడదని, ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్లొద్దని, తల్లిదండ్రులు కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సూచించారు. బస్సు, ఆటో, వ్యాన్ కండిషన్ బాగుందో లేదో గమనించాలి. పరిస్థితులను బట్టి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేస్తున్నారు.
నేటి నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో స్పెషల్ డ్రైవ్
ఉమ్మడి మెదక్ జిల్లాలో1,850 నుంచి1,900 వరకు ప్రైవేట్ స్కూళ్ల బస్సులు ఉండగా.. ఇప్పటివరకు 80 శాతం బస్సులు ఫిట్ నెస్ పరీక్షలు చేయించుకోగా, మరో పది శాతం చేయించుకోవాల్సి ఉంది. అయితే 10 శాతం బస్సులు15 ఏళ్ల ప్రయాణ కాలం ముగియడంతో వాడడానికి వీలులేదు. వాటిని తొలగిస్తామని ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. గతేడాది 1,881 బస్సులకు ఫిట్ నెట్ పరీక్షలు చేశారు. ఈసారి జూన్ ఫస్ట్ వీక్ నుంచి బస్సుల ఫిట్‌నెస్ పరీక్షల ప్రక్రియను అధికారులు చేపట్టారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్న బస్సుల ఫిట్‌నెస్ సర్టిఫికెట్లను రెన్యూవల్ చేస్తున్నారు. ఇందుకు ముందుగానే స్కూళ్ల యాజమాన్యాలు ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకుంటుడగా.. ప్రస్తుతం ఆర్టీఏ ఆఫీసుల వద్ద ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గతేడాది ఉమ్మడి మెదక్ జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన, ఫిట్‌నెస్ లేని సుమారు 40 నుంచి 50 కి పైగా స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీల్లో భాగంగా సీజ్ చేశారు. మరికొన్ని బస్సులకు జరిమానాలు విధించారు. రేపటి నుంచి ముమ్మరంగా బస్సులను తనిఖీలు చేయడానికి ఉమ్మడి జిల్లాలో మొబైల్ స్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఫిట్‌నెస్ లేకుండా రోడ్డెక్కే బస్సులను తక్షణమే సీజ్ చేస్తామని ఉమ్మడి మెదక్ జిల్లా రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. సంగారెడ్డి ,మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ చేస్తామని పేర్కొంటున్నారు. స్కూళ్ల యాజమాన్యలు వాహనాలనుకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ మస్ట్ గా తీసుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేస్తున్నారు.
కొన్ని చిన్న ప్రైవేట్ స్కూళ్లు ఖర్చులు తగ్గించుకోవడానికి తక్కువ జీతం కోసం తాత్కాలిక లేదా అనుభవం లేని డ్రైవర్లను పెట్టుకుంటున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిమితికి మించి విద్యార్థులను బస్సుల్లో తరలించడం అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులను ఎక్కించుకోవడంపై ఆర్టీఏ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు బస్సులు మాత్రమే కాకుండా పెద్దఎత్తున పిల్లలు ఆటోలు, మినీ వ్యాన్లలో స్కూళ్లకు వెళ్తుంటారు. ఓవర్‌లోడింగ్‌తో చాలా సార్లు విద్యార్థులను తీసుకెళ్లే వాహనాలు బారిన పడిన ఘటనలు ఉండగా.. ఈసారి ప్రమాదాలను అరికట్టేందుకు ఆర్టీఏ ప్రత్యేకంగా తనిఖీ చేయాల్సి ఉంది.
పర్మిషన్లు లేకుండానే ఫిట్ నెస్ కు ఓకే..!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం సుమారుగా 1,750 పాఠశాల బస్సులు నడుస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో మహబూబ్ నగర్ జిల్లాలో 482, వనపర్తి జిల్లాలో 230, జోగులాంబ గద్వాల్ జిల్లాలో సుమారు 250 – 400, నాగర్ కర్నూల్ జిల్లాలో 320 – 500, నారాయణపేట జిల్లాలో 280 – 350 బస్సులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు స్కూల్ బస్సుల్లో దాదాపు 70 –80 శాతం వరకు ఫిట్ నెస్ పరీక్షలు పూర్తయినట్టు ఆర్టీఏ అధికారుల ద్వారా తెలుస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 40 – 55 బస్సుల వరకు ఫిట్ నెస్ లేని కారణంగా సీజ్ చేసినట్లు సమాచారం. అయితే కొన్ని సందర్భాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఫిట్ నెస్ టెస్ట్ లో ఓకే చెప్పి రోడ్లపైకి పంపిస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి.
దాదాపుగా అన్ని పాఠశాలల అవసరాన్ని బట్టి అనుభవం లేకున్నా కానీ డ్రైవర్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల బస్సుల్లో ప్రయాణిస్తుం టారు. ఉమ్మడి జిల్లాలో వందలాది ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా, ఇందులో కేవలం కొన్ని బస్సులకు మాత్రమే యాజమాన్యాలు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించాయి. మిగిలిన బస్సులు ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యార్థులను ఎక్కించుకొని రోడ్డెక్కడానికి సిద్ధమవుతుండగా.. గతేడాది బస్సుల బ్రేకులు ఫెయిల్ జరిగిన ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాఠశాల బస్సుల ఫిట్ నెస్ పరీక్షలు నామమాత్రంగా సాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఆర్టీఏ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయకుండా పైపైన చూసి పర్మిషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. హడావుడిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు తెలుస్తుంది. పాఠశాల బస్సులకు పరీక్షల పేరిట తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండగా.. వాహన పత్రాలు, టైర్లు, హెడ్ లైట్లు, ఇండికేటర్లు, బ్రేకులు, వైపర్లు, స్టీరింగ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ వంటివి పక్కాగా ఉన్నాయో లేదో నడిపి పరీక్షించాల్సి ఉంది. ఆ ఊసే ఎత్తడం లేదు. నామమాత్రంగానే చూసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం విద్యా సంస్థల బస్సులు 2,249 ఉండగా.. ఇంకా పరీక్షలు జరగాల్సినవి 512 ఉన్నాయని తెలుస్తుంది.
ఇందులో 15 ఏళ్లు నిండిన బస్సులు 433 ఉన్నాయి. ఆదివారంతోనే ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తి కావాల్సి ఉండగా మిగిలిన బస్సుల టెస్ట్ లపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కొన్ని బస్సులకు 15 ఏళ్లు నిండటానికి కేవలం 3 – 6 నెలల గడువు మాత్రమే ఉండటంతో స్కూల్ యాజమాన్యాలు వీటిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఆర్టీఏ అధికారులు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా రోడ్లపైకి బస్సులను తీసుకొస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ జిల్లా రవాణా శాఖ అధికారి జైపాల్ రెడ్డి స్పష్టం చేశారు. రూల్స్ కు అనుగుణంగా లేని 20కి పైగా బస్సుల సీజ్ చేసినట్టు తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తనిఖీలు పారదర్శకంగా జరిగేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇదీ పరిస్థితి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 1,068 ప్రైవేటు స్కూల్ బస్సులు ఉన్నాయి. ఇప్పటికే వీటిలో 549 బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాయి. సుమారు 60 శాతం బస్సులకు ఫిట్ నెస్ టెస్ట్ లు చేయించుకోగా.. మిగత బస్సులు ఫిట్ నెస్ చేయించుకోనట్టు తెలుస్తుంది. గతేడాది 30 బస్సులను ఫిట్ నెస్ లేని కారణంగా ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఉమ్మడి జిల్లాలో రూల్స్ అనుగుణంగా శిక్షణ పొందిన డ్రైవర్లు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే.. స్కూల్ యాజమాన్యాలకు డ్రైవర్ల కొరత పెద్ద సమస్యగా మారింది. పరిమితికి మించి బస్సుల్లో విద్యార్ధులను తరలించడం కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. గతేడాది భద్రాద్రి జిల్లా అశ్వాపురం , ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో ప్రైవేట్ స్కూల్ బస్సులు ప్రమాదాల బారిన పడిన ఘటనలు ఉన్నాయి.
ఉమ్మడి నల్లగొండలో 600 బస్సులకుపైగా ఫిట్‌నెస్ నిల్
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రైవేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం మాత్రం మరోసారి బయటపడింది. జిల్లాలోని మొత్తం 1,678 స్కూల్ బస్సులు ఉండగా.. ఇప్పటివరకు కేవలం 1,076 బస్సులకు మాత్రమే టెస్టులు పూర్తయ్యాయి. ఇంకా 602 బస్సులు ఫిట్‌నెస్ టెస్టులు పూర్తి చేసుకోలేదు. గడువు ముగిసినా కానీ సర్టిఫికెట్ లేకుండానే రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నాయి. నల్లగొండ లో 703 కు ఇంకా 239 బస్సులకు ఫిట్‌నెస్ పెండింగ్‌లోనే ఉంది. సూర్యాపేట జిల్లాలో 608 కు ఇంకా 257 బస్సులు కనీసం ఆర్టీఏ ఆఫీసు వైపు వెళ్లలేదు. యాదాద్రి జిల్లాలో 367 కు ఇంకా 106 బస్సులకు ఫిట్‌నెస్ ప్రక్రియ పూర్తి కాలేదు. యాజమాన్యాలు విద్యార్థులను చేర్చుకోవడంపై చూపిస్తున్న శ్రద్ధ బస్సుల ఫిట్ నెస్ పరీక్షలపై దృష్టి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఆర్టీఏ అధికారుల తీరు మాత్రం షరా మాములుగానే ఉంది. ఏటా జూన్ రాగానే ఫిట్‌నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం, కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతుంటారు కానీ, క్షేత్రస్థాయిలో వందలాది బస్సులు రోడ్లపై తిరుగుతున్నా పట్టించుకోవడంలేదనే విమర్శలూ లేకపోలేదు. ఎక్కడైనా ప్రమాదం జరిగిప్పుడు మాత్రమే ప్రత్యేక తనిఖీలు, బస్సుల సీజ్ అంటూ హడావుడి చేస్తారని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. రవాణా శాఖలోని కొందరు అధికారులు లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించే స్కూల్ బస్సులపై విధించే జరిమానాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని వేల రూపాయల ఫైన్ కట్టి యాజమాన్యాలు మళ్లీ అదే కండిషన్ లేని బస్సులను రోడ్లపైకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కంటితుడుపు చర్యలు ఆపి, శాశ్వత నిఘా ఏర్పాటు చేయకపోతే.. భవిష్యత్తులో జరిగే ప్రతి ప్రమాదాలకు ఆర్టీఏనే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఉమ్మడి వరంగల్‌లో సగానికి పైగా పూర్తికాలే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 3,500 వరకు విద్యా సంస్థలకు చెందిన బస్సులు ఉండగా, ఇందులో 70 శాతం బస్సులకు ఫిట్ నెస్ సామర్థ్య పరీక్షలు నిర్వహించినట్టు, మిగిలిన 30 శాతం రూల్స్ ఉల్లఘించి తిరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏటా మే 31లోపు లేదా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చేయించుకోవాలనేది ఆర్టీఏ నిబంధన ఉంది. అయితే.. బస్సులపై నిఘా ఉంచి నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ళ మత్తులో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. స్కూల్ బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహించాలి. 15 ఏళ్ళు దాటిన బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తారు.
ఒక బస్సుకు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, ట్యాక్స్ కలిపి రూ.40-50 వేలు అవుతుంది. కానీ కొంతమంది ఫిట్ నెస్, ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. మరి కొంతమంది ఫిట్‌నెస్‌కి వెళ్తే దొరికిపోతామని భయంతో ఓవర్ లోడ్ తో కాలం చెల్లిన 40 సీట్ల బస్సులో 60-70 మంది పిల్లలను కుక్కి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఆర్టీఏ రూల్స్ ప్రకారం స్కూల్ బస్సులు ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 40 కి. మీ వేగం లాక్ సిస్టమ్, అత్యవసర డోర్, ఫైర్, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అమర్చుకోవాలి. డ్రైవర్‌కి 10 ఏళ్ల అనుభవంతో పోలీస్ వెరిఫికేషన్ మస్ట్ గా ఉండాలి. అయితే 70% ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఇలాంటి నిబంధనలు పాటించడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనీ రవాణా శాఖలో బదిలీలతో ఇంకా సగానికి పైగా బస్సులకు టెస్టులు జరగడం లేదని తెలుస్తుంది.

