Mobile Popup Ad
Mobile Popup Ad

జోరుగా వర్షాలు.. పత్తి విత్తనాల సాగులో రైతులు బిజీ

కలం, నల్లగొండ బ్యూరో: ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు (Nalgonda Farmers) ముందస్తు సాగుబాట పట్టారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురవడంతో భూముల్లో అనుకూలమైన తేమ (పదును) చేరింది. దీంతో రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి విత్తనాల విత్తనంలో రైతులు బిజీగా ఉన్నారు. ఒకవైపు రైతులు విత్తనాలు నాటుతుండగా, మరోవైపు వ్యవసాయ అధికారులు ఇప్పుడే నాటుకోవడం వద్దని సూచిస్తున్నారు. అయితే, ‘అదును తప్పితే మళ్లీ రాదు’ అంటూ రైతులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ముందుగానే విత్తనాలు నాటుకుంటే పత్తి పంటకు అవసరమైన యూరియా, ఇతర ఎరువులు సకాలంలో లభిస్తాయని భావిస్తున్నారు. అందరూ ఒకేసారి సాగు ప్రారంభిస్తే ఎరువులకు భారీ డిమాండ్ ఏర్పడుతుందని చెబుతున్నారు. దీనికితోడు అరక (వ్యవసాయ పనిముట్లు, కూలీలు)కు కూడా అధిక డిమాండ్ ఉంటుందని, ముందస్తుగా సాగు చేపడితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వర్షాలు మధ్యలో వెనుకంజ వేస్తే రైతులు తీవ్ర నష్టాలు చవిచూడాల్సి వచ్చే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు హెచ్చరిస్తున్నారు.

22.50 లక్షల ప్యాకెట్లు అవసరం..

ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది సుమారు 9 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఎకరానికి సగటున రెండున్నర ప్యాకెట్ల చొప్పున మొత్తం 22.50 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరం. గతేడాది 7.65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి ముందస్తు వర్షాలతో రైతులు తొందరగా విత్తనాలు నాటుతున్నారు. ఒక ఎకరానికి రెండున్నర నుంచి మూడు ప్యాకెట్ల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ప్రస్తుతం ఒక పత్తి విత్తన ప్యాకెట్ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.750 నుంచి రూ.800 వరకు ఉంది. అంటే ఎకరానికి విత్తనాలకే రూ.2,250 నుంచి రూ.2,400 వరకు ఖర్చు అవుతుంది. వాతావరణం అనుకూలించకపోతే రైతులు మళ్లీ మొదటి నుంచి విత్తనాలు నాటాల్సిన పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. అయితే వర్షాలు కొంతకాలం ఆగిపోయినా, లేదా అతివృష్టి సంభవించినా మొలక దశలోనే విత్తనాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. సరైన తేమ లేకపోతే విత్తనాలు మొలకెత్తకపోవచ్చు. మరోవైపు భారీ వర్షాల వల్ల అవి కుళ్లిపోయే అవకాశమూ లేకపోలేదు.

విత్తనాలకే రూ.315 కోట్లు..

వర్షాలు సకాలంలో కురిసి, వాతావరణం అనుకూలంగా ఉంటే పత్తి సాగు ప్రారంభ దశలోనే రైతులు ఎకరానికి కనీసం రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. భూమి దున్నడం, అచ్చు తోలడం, విత్తనాల కొనుగోలు, విత్తనాలు నాటే కూలీల ఖర్చులు తదితర వ్యయాలు కలిపి ఇంత మొత్తం అవుతుంది. జిల్లాలో 9 లక్షల ఎకరాలకు ఎకరానికి రూ.7 వేల చొప్పున లెక్కిస్తే ప్రారంభ దశలోనే రైతులు సుమారు రూ.630 కోట్ల పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కురిసిన ముందస్తు వర్షాలతో కనీసం సగం విస్తీర్ణం అయిన 4.5 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు నాటినా సుమారు రూ.315 కోట్ల పెట్టుబడి అవుతుంది. ఇప్పటికే ఎల్‌నినో ప్రభావంపై వ్యవసాయ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాల విషయంలో చిన్న తేడా వచ్చినా రైతులు పెట్టిన రూ.315 కోట్ల పెట్టుబడి ప్రమాదంలో పడే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం తేడా వచ్చినా రూ.315 కోట్లు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>