కలం, కరీంనగర్ బ్యూరో: ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం వెంటనే నోటిఫికేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కరీంనగర్ జిల్లా బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద గురువారం భారతీయ జనతా యువ మోర్చా (Karimnagar BJYM) జిల్లా శాఖ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు సంగ నరేష్ పాల్గొని ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిని రెండున్నర ఇలా ఇవ్వకుండా నిరుద్యోగ సమాజాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, మెగా డీఎస్సీ ఇస్తామని నమ్మించి, నేడు ప్రకటించిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ అంశంలో కూడా నిరుద్యోగులను తీవ్రంగా మోసం చేసిందన్నారు.
నిరుద్యోగుల ఆశలను కాంగ్రెస్ వమ్ము చేసిందని, తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమడుతుందని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ప్రతి నిరుద్యోగికి న్యాయం జరిగేలా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటున్న ప్రభుత్వ వైఖరి మారకపోతే, రాబోయే రోజుల్లో యువతను ఏకం చేసి రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యధర్శి ఎడవెల్లి శశిధర్ రెడ్డి, నక్క ప్రమోద్, గుర్రం వెంకటేష్ గౌడ్, చిక్కుల కిరణ్, గడ్డం అరుణ్, మణిదీప్, రాహుల్ రెడ్డి, జాగిరి రాజేందర్ లతోపాటు బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

