కలం, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ (SC ST Commission) బుధవారం నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ (Collector Chandrashekar) ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్‌లోని ఉదయాదిత్య భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో పాటు సభ్యులు కుష్రుమ్ నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకతి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ ఈ సమీక్షలో పాల్గొంటారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన భూ సమస్యల పరిష్కారం, ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు – చట్టపరమైన చర్యలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రోస్టర్ పాయింట్ల పక్కా అమలు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రగతి అంశాలపై సమీక్షించనున్నారు. ఈ ప్రాధాన్యత కలిగిన సమీక్షా సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డీసీఓలు, ఆర్సీఓలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తప్పనిసరిగా హాజరుకావాలని కలెక్టర్ ఆదేశించారు.

