కలం, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై ప్రపంచ ఛాంపియన్షిప్.. అది కూడా తొలిసారి. భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి (Satwik-Chirag)ఈ అరుదైన అవకాశం కోసం సిద్ధమైంది. ఇంటి ప్రేక్షకుల మద్దతుతో టోర్నీలో వీలైనంత దూరం వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అరేనాలో ప్రపంచ ఛాంపియన్షిప్ జరగనుంది. 17 ఏళ్ల తర్వాత ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ భారత్‌లో జరుగుతోంది.
ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతున్న సాత్విక్-చిరాగ్‌కు తొలి రౌండ్లో బై లభించింది. దీంతో స్కాట్లాండ్కు చెందిన అలెగ్జాండర్ డన్-ఆడమ్ ప్రింగిల్, థాయ్‌లాండ్ జోడీ చాలోఎంపోన్ చరోయెన్కిటమోర్న్-వొరాపోల్ థోంగ్సా-నా మధ్య విజేతతో వారు తలపడనున్నారు. సొంత ప్రేక్షకుల ముందు ఆడటం తమకు అదనపు బలమని చిరాగ్ చెప్పాడు. ఇలాంటి అవకాశం కెరీర్లో అరుదుగా వస్తుందని తెలిపాడు.
ఒత్తిడిగా భావించకుండా ఈ అవకాశాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించాడు. సాత్విక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంటి ప్రేక్షకుల ముందు ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పాడు. ఇటీవల భుజం సమస్యతో సాత్విక్ ఇబ్బంది పడ్డాడు. జులైలో జపాన్ ఓపెన్ తొలి రౌండ్లో ఆ సమస్య కారణంగా సాత్విక్-చిరాగ్ (Satwik-Chirag) మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చైనా ఓపెన్ నుంచి కూడా వైదొలిగారు.
ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు పూర్తిగా సిద్ధం కావడమే లక్ష్యంగా పునరావాసంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం తాను పూర్తి ఫిట్‌గా ఉన్నానని సాత్విక్ తెలిపాడు. ఢిల్లీలో సాధన కూడా బాగానే సాగిందని చెప్పాడు. అయితే ప్రాక్టీస్‌లో కోర్టు పరిస్థితులు మారుతున్నాయని సాత్విక్ వివరించాడు. ముఖ్యంగా గాలి ప్రవాహంలో తేడాలు కనిపిస్తున్నా.. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో ఇది సాధారణమేనని పేర్కొన్నాడు.
Also Read : మళ్లీ ప్రపంచ పోరుకు సింధు సై.. సవాలుకు సిద్ధం!
Follow Us On: X(Twitter)

