కలం, ఖమ్మం బ్యూరో : ఇసుక లారీల వేగానికి మరో అమాయకుని ప్రాణం బలికావడంతో దుమ్ముగూడెం (Dummugudem) మండలం లక్ష్మీనగరంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అధికారుల పర్యవేక్షణ లోపం, మితిమీరిన ఓవర్ లోడ్ లారీల రాకపోకలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు రోడ్డుపై బారికేడ్లు కట్టి మంగళవారం సమరశంఖం పూరించారు.
లక్ష్మీనగరం ఎస్బీఐ బ్యాంకు సమీపంలో నిన్న రాత్రి చర్ల నుంచి అతివేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొని మద్ది రాము అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘోర ఘటనతో రగిలిపోయిన ప్రజలు రోడ్డుపై రాస్తారోకో నిర్వహిస్తుండగా, అదే మార్గంలో వస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ వాహనాన్ని స్థానికులు, నాయకులు ఒక్కసారిగా చుట్టుముట్టి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శులు ముసలి సతీష్, మట్ట నరసింహారావు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ మరణానికి ప్రత్యక్ష కారణమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇసుక రవాణా పేరుతో నిత్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడిన నాయకులు, మరణించిన మద్ది రాము కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ. 1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
భద్రాచలం నుండి వెంకటాపురం వరకు నూతన బీటీ రోడ్ల నిర్మాణం పూర్తయ్యేంత వరకు ఇసుక లారీల రాకపోకలను పూర్తిగా నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఒకవేళ తమ డిమాండ్లను పట్టించుకోకపోతే భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం గ్రామాల ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వహిస్తామని పాలకులను, అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.
నిరసనకారుల ఆగ్రహాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వెంటనే వారితో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. ఇకపై రాత్రి సమయాల్లో, తెల్లవారుజామున నిబంధనలకు విరుద్ధంగా తిరిగే ఇసుక లారీల రాకపోకలను తక్షణమే కట్టడి చేస్తామని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ హామీ ఇచ్చారు.

