కలం, కరీంనగర్: వినాయక విగ్రహాల నిమజ్జనానికి చింతకుంట కెనాల్‌లో (Chintakunta Canal) నీటిని విడుదల చేయాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి చింతకుంట కెనాల్ వద్ద నిమజ్జన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఎస్ఆర్ఎస్‌పీ నుంచి ప్రస్తుతం నీటి విడుదల లేకపోవడంతో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని గంగుల కమలాకర్ తెలిపారు. ఈ ప్రాంతంలో సుమారు 700 నుంచి 800 వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసే అవకాశం ఉందన్నారు. నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని కోరుతూ అక్కడి నుంచే ఎస్ఆర్ఎస్‌పీ సీఈ సుమతితో ఫోన్‌లో మాట్లాడారు. కనీసం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి అడ్డుకట్ట వేస్తే 10 నుంచి 12 అడుగుల మేర నీటిని నిల్వ చేయవచ్చని సూచించారు. నిమజ్జన ఏర్పాట్లకు సమయం ఉండేలా రెండు, మూడు రోజుల్లో నీటిని విడుదల చేయాలని కోరారు.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరీంనగర్‌లో వినాయక నిమజ్జనాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని గంగుల కమలాకర్ అన్నారు. చింతకుంటతో పాటు కొత్తపల్లి, మానకొండూర్ ప్రాంతాల్లో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సకాలంలో నీటిని విడుదల చేస్తే నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్, కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, పలువురు మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, డివిజన్ వాసులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

