కలం, బాసర : అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel) అన్నారు. బాసర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో 107 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఎలాంటి భేదాభిప్రాయాలకు, పక్షపాతానికి తావులేకుండా అర్హతే ప్రాతిపదికగా ఇళ్లను మంజూరు చేస్తామని తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇల్లు మంజూరు కాని వారిని గుర్తించి, వారికి కూడా ప్రభుత్వ పథకం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
అర్హులైన లబ్ధిదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి అర్హ కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

