కలం, వెబ్ డెస్క్: కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని.. అమరావతి కాంట్రాక్టర్ల కోసమే పని చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఘాటు విమర్శలు చేశారు. ఓ పక్క పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు బంక్‌ల వద్ద క్యూలైన్లలో పడిగాపులు పడుతుంటే, అమరావతిలో నిర్మాణాల కోసం స్థానిక రీటెయిల్ అవుట్‌లెట్ల నుంచి ప్రత్యేకంగా డీజిల్ సరఫరా చేయాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ (ఓఎంసీ)లకు లేఖ రాయడం, రాష్ట్ర ప్రజలకన్నా కాంట్రాక్టర్ల పైనే మీకున్న శ్రద్ధ చూపుతోందని మండిపడ్డారు. పొలాల్లో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు నడవక రైతులు.. పెట్రోల్ దొరక్క రోడ్లపై ఆటోవాలాలు, డీజిల్ దొరక్క లారీలు, ట్రావెల్స్ బస్సులు, సొంత వాహనాల్లో దూర ప్రయాణాలు చేసే వాళ్లు మధ్యలో ఆగిపోతున్నారని పేర్కొన్నారు. పెట్రోల్ బంక్‌ల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నా.. తమలో ఏ మాత్రం చలనం రావడం లేదంటే, ప్రజా సమస్యలపై తమ విధానం ఏమిటన్న దానికి అద్దం పడుతోందని విమర్శించారు.

