Mobile Popup Ad
Mobile Popup Ad

మేరీమాత చర్చి.. అక్కడంతా హిందూ సంప్రదాయమే !

కలం, నాగార్జునసాగర్: అది కృష్ణానది తీరంలో నాగార్జునసాగర్ వద్ద వెలసిన మేరీమాత చర్చి.. కాదండోయ్ ఆలయమే. పేరుకు అది క్రిస్టియన్ టెంపుల్ అయినప్పటికీ అక్కడికి సర్వమతాల ప్రజలు వచ్చి మొక్కులు చెల్లిస్తుంటారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా అందరూ తమ మొక్కులను చెల్లిస్తుంటారు. మేరీమాత ఆలయం సర్వమతాల సంగమంగా ఆధ్యాత్మికతను వెదజల్లుతోంది. అయితే ఈ మేరీమాత టెంపుల్‌కు ఓ ప్రత్యేకత ఉంది.

ఇది దేశంలోనే భారతీయ సంప్రదాయ రీతిలో నిర్మించిన తొలి క్రైస్తవ మందిరంగా గుర్తింపు దక్కించుకుంది. ఇక్కడి ఆలయంలో దీప, ధూప నైవేద్యాల సమర్పణ, కొబ్బరికాయలు కొట్టడం, అగరవత్తులు వెలిగించడం, హారతి, తలనీలాల సమర్పణ.. ఇలా అచ్చం హిందూ ఆలయాల్లో మొక్కులు చెల్లించే తరహాలోనే భక్తులు మొక్కులు సమర్పిస్తుంటారు. ఈ ఆలయం నాగార్జునసాగర్ రైట్ బ్యాంక్ కెనాల్‌లో ప్రముఖ సాగర్ మాత (Sagar Mata) పుణ్యక్షేత్రంగా రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలిచింది.

భారతీయ సంప్రదాయ తరహాలోనే..

సాగర్ మాత (Sagar Mata) ఆలయం భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మాణం ఉంటుంది. ఆలయ నిర్మాణం, గోపురంపై విగ్రహాల సమూహం హిందూ ఆలయాలను తలపిస్తోంది. ఏపీలోని మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో విచారణ గురువుగా పనిచేసిన మొదటి సైమన్ స్వామి ఈ ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు. అప్పటి గుంటూరు క్రైస్తవ పీఠాధిపతి బాలశౌరి అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తూ ఆలయాన్ని పూర్తి చేశారు. నిజానికి ఈ ఆలయ నిర్మాణానికి 1976 ఫిబ్రవరి 10న శంకుస్థాపన చేయగా, ఆ తర్వాత వరుసగా వరదలు, కరువు కాటకాలు తలెత్తడంతో ఆలయ నిర్మాణం చాలాకాలం పాటు నిలిచిపోయింది. ఈ క్రమంలో సైమన్ స్వామి రెంటచింతల ఫారెస్ట్ నుంచి ఆర్థిక సాయం తీసుకుని సాగరమాత టెంపుల్‌ను పూర్తి చేశారు.

మూడు రోజుల పాటు ఉత్సవాలు..

సాగరమాత ఆలయానికి ఏటేటా భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే సాగరమాత మహోత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ ఏడాది సైతం ఉత్సవాలకు సాగరమాత ఆలయం ముస్తాబయ్యింది. సాగర మాత ఉత్సవాల నేపథ్యంలో మార్చి 7 నుంచి 9 వరకు సాగర్ మాత పుణ్యక్షేత్రంలో దివ్య సత్రఫ్ సాధన నిత్య ఆరాధనలు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

7వ  తేదీన ఉదయం 5.30 గంటలకు సాగరమాత విచారణ గురువు శ్రీ పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ చే దివ్య బలి పూజ కార్యక్రమం, 6.30 గంటలకు గురు శ్రీ తంబి అన్నెంచే పూజలు, మధ్యాహ్నం ఒంటి గంటకు మహా అన్నదానం, అనంతరం వాక్య పరిచర్య, స్వస్థత ప్రార్థనలు, సాయంత్రం ఐదున్నర గంటలకు గురు శ్రీ అల్లంచిన సైరెడ్డిచే పూజా కార్యక్రమాలు, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు కొవ్వొత్తులతో తిరు ప్రదక్షిణ, రాత్రి 8 గంటలకు సాగర మాత కళాకారుల బృందంతో సంసోను డెలీలా నాటకం నిర్వహిస్తారు. ఈ సాగర్ మాతా ఉత్సవాలకు దాదాపు 2 లక్షల మంది భక్తులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నుంచి పాల్గొంటారు.

ఉత్సవాలకు ఏర్పాట్లు: జోసెఫ్ బాల సాగర్, సాగర్ మాత చర్చి ఫాదర్

మూడు రోజుల పాటు జరిగే సాగరమాత (Sagar Mata) జాతర ఉత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ముమ్మరంగా చేశాం. సాగర మాత మహోత్సవానికి వచ్చే భక్తులకు తాగునీరు, మెడికల్ సదుపాయం, ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేశాం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>