నిజామాబాద్, కామారెడ్డి డిపోల్లో ఆర్టీసీ ఎన్నికలు.. యూనియన్ గుర్తింపు కోసం పోరు

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ యూనియన్ల ఎన్నికలు (RTC Union Elections) కొనసాగుతున్నాయి. నిజామాబాద్ డిపోల (Nizamabad Depots) లో 1,864 ఓట్లు ఉన్నాయి. మధ్యాహ్నానికి డిపో–1లో 394 ఓట్లకు గాను 80శాతం ఓటింగ్ జరిగింది. అలాగే న్యాల్ కల్ డిపో–2లో మొత్తంగా 174 ఓట్లు ఉండగా 11 గంటల వరకు 96ఓట్లు పోలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్ఎంయూ ఒక కూటమి కాగా.. టీడబ్ల్యూయూ, బీఎంఎస్, టీజేఎంయూ మరో కూటమిగా నిలిచి గుర్తింపు కోసం పోరాడుతున్నాయి. వివిధ యూనియన్లకు చెందిన ప్రతినిధులు డిపో బయట చేరుకుని తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పోలింగ్ కోసం డిపోలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓటర్లు స్లిప్పులు తీసుకుని క్యూ లైన్లో నిలబడి ఓటు వేస్తున్నారు. నిజామాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 1,864 మంది ఓటర్లు ఉండగా, అన్ని డిపోల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఓటరు తప్ప మిగతా ఎవరినీ డిపో లోపలికి అనుమతించడం లేదు. కాగా పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో నువ్వా నేనా అన్నట్టుగా పోలింగ్ సాగుతోంది.

కామారెడ్డి డిపో పరిధిలో మొత్తం 408 మంది కార్మికులకు ఓటు హక్కు ఉండగా, మధ్యాహ్నం వరకు దాదాపు 200 మంది ఓటు వేశారు. దాదాపు 50 శాతం పోలింగ్ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇంకా పోలింగ్ కొనసాగుతోంది. తెల్లవారుజామున విధులు ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీకి వెళ్లే ముందే ఓటు వేసి వెళ్లారు. దీంతో తొలి రెండు గంటల్లోనే భారీగా పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లిన సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రంలోపు ఓటు వేసే అవకాశం ఉందని యూనియన్ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు విధుల్లో ఉండి ఓటు వేయలేని కార్మికులకు బ్యాలెట్ ద్వారా 14, 15 తేదీలలో ఓటుహక్కు అవకాశం కల్పించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో డిపో వద్ద సందడి నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>