బీజేపీ, బీఆర్ఎస్ రహస్య బంధం బట్టబయలు: మహేష్ కుమార్ గౌడ్

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న’సర్’ ప్రక్రియపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు తప్ప దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రక్రియకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాడుతుంటే, తెలంగాణలోని బీఆర్‌ఎస్ పార్టీ మౌనం వహించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఆరోపించారు.

బీఆర్‌ఎస్ మౌనం వెనుక ‘అరెస్ట్’ భయాలు కేంద్రంలో ప్రధాని మోదీ, అమిత్ షాల రాజకీయ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం చేస్తుంటే, బీఆర్‌ఎస్ పాత్ర ఎక్కడ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సీఈసీ తీవ్ర తప్పిదాలు చేస్తున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నోరు మెదపకపోవడం, ఒక్క నిరసన కార్యక్రమం కూడా చేపట్టకపోవడం వెనుక బీజేపీతో ఉన్న లోపాయికారీ ఒప్పందమే కారణమని విమర్శించారు. బీజేపీని విమర్శిస్తే ఫార్ములా ఈ-రేస్ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ అరెస్టులు చేస్తుందనే భయంతోనే బీఆర్‌ఎస్ నాయకులు ‘సర్’ ప్రక్రియపై ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారని ఎద్దేవా చేశారు.

దళితులు, మైనారిటీల ఓట్ల తొలగింపు కుట్ర

‘సర్’ ప్రక్రియ పేరుతో దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను కుట్రపూరితంగా తొలగిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌లో రోహింగ్యాల పేరు చెప్పి మమతా బెనర్జీని, బీహార్‌లో ఆర్‌జేడీని గెలవకుండా ఈ అక్రమాలతోనే అడ్డుకున్నారని మండిపడ్డారు. గతంలో టీఎన్ శేషన్, లింగ్డో, కృష్ణమూర్తి వంటి అధికారుల హయాంలో SIR అత్యంత పారదర్శకంగా జరిగిందని, కానీ ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ బీజేపీకి పూర్తిగా తొత్తుగా మారారని ఆరోపించారు.

కేటీఆర్‌కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి?

గతంలో ఉండటానికి ఇల్లు కూడా లేదన్న కేటీఆర్‌కు ఫైవ్ స్టార్ హోటళ్లు, వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ నిలదీశారు. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే బీఆర్‌ఎస్ నాయకులు ‘సర్’ అక్రమాలపై మాట్లాడటం లేదని విమర్శించారు. అయితే ఏజ్ తో నిమిత్తం లేకుండా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. రాహుల్ గాంధీకి అధికార దాహం ఉంటే 2009లోనే ప్రధాని అయ్యేవారని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో 90 లక్షల ఓట్లను తొలగించే కుట్ర!

రాష్ట్రంలో వివిధ కారణాల పేరుతో సుమారు 90 లక్షల ఓట్లను దురుద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో 36 వేల బీఎల్‌ఓ ఫారాలు ఇస్తే, స్టేట్ సీఈసీ పొరపాటు వల్ల తక్కువ చూపించారని, తప్పు జరిగిందని స్వయంగా స్టేట్ సీఈసీ ఒప్పుకున్నారని గుర్తుచేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు, ధర్నాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. కేంద్రంలో శాశ్వతంగా అధికారంలో ఉండటానికే బీజేపీ రాజ్యాంగబద్ధ వ్యవస్థలను ధ్వంసం చేస్తోందని, బీజేపీ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలేనని వ్యాఖ్యానించారు. దేశంలో అర్హత ఉన్న ప్రతి ఓటరు హక్కును కాపాడటమే కాంగ్రెస్ ధ్యేయమని, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>