ఆయిల్ సంక్షోభం.. భారీగా పెరిగిన పెట్రోల్ ధరలు

కలం, వెబ్ డెస్క్: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అమెరికా ‌‌- ఇజ్రాయెల్ (US, Israel), ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన డేటా ప్రకారం.. ఫిబ్రవరి చివరిలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి డజన్ల కొద్దీ దేశాల్లో పెట్రోల్ ధరల్లో (Petrol Prices) గణనీయమైన పెరుగుదల నమోదైంది. రానున్న కాలంలో ఈ పెరుగుదల మిగతా దేశాలకు పాకే అవకాశం ఉంది. దీంతో ఈ యుద్ధం వాహనాదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

చమురు ఉత్పత్తిలో గల్ఫ్ దేశాలే కీలకం..

గల్ఫ్ దేశాలు చమురు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తాయి. అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ఇంధన సరఫరాపై అనిశ్చితి ఏర్పడి ప్రపంచదేశాల్లో వాటి ధరలు పెరుగుతాయి.అటు ప్రపంచ చమురు రవాణాలో అయిదో వంతు హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది.అయితే అమెరికా ‌‌‌‌‌‌‌‌- ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ హార్ముజ్ జలసంధిని నిలిపివేసింది. ఈ పరిణామంతో గల్ఫ్ దేశాల నుంచి ఇంధనాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు తీవ్రంగా నష్​టపోతున్నాయి.ఆయా దేశాల్లో భారీగా పెట్రోల్ రేట్లు పెరిగాయి. మరోవైపు ఇంధన సరఫరాకు అంతరాయం కలుగవచ్చనే ఉద్దేశంతో పలు దేశాల్లో ఇప్పటికే మోస్తరుగా పెట్రోల్ రేట్లు పెంచేయడం గమనార్హం.

ఏయే ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ఇరాన్, ఇజ్రాయెల్ ‌‌అమెరికా దేశాల ఉద్రిక్తతల వల్ల ఆసియా, ఆఫ్రికా, యూరప్ వంటి ఖండాల్లోని దేశాల్లో భారీగా ఇంధన ధరలు పెరిగాయి. ఆసియాలోని కంబోడియా, వియత్నాం, పాకిస్తాన్ వంటి దేశాలు.. ఆఫ్​రికాలోని నైజీరియా, సియెర్రా లియోన్ దేశాలు చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడడం వల్ల వాటి రేట్లు భారీగా పెరిగాయి. అమెరికా, కెనడా, యూరప్ దేశాల్లోనూ.. మాల్దీవులు, సెషెల్స్ వంటి దేశాల్లోనూ ఇంధన ధరలు మోస్తరుగా పెరిగాయి.

భారత్ పై యుద్ధ ప్రభావం ఎంత..?

భారత్ (India) వంటి పలు దేశాల్లో ప్రస్తుతం ఇంధన ధరలు స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే భవిష్యత్ లో భారత్ వంటి దేశాల్లోనూ పెట్రోల్ ధరలు పెరగొచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన ఇంటి దాకా వచ్చేసింది. భారత్ లో ఎల్పీజీ సిలిండర్ల కొరత దీనికి ఉదాహరణగా కనిపిస్తోంది. రానున్న కాలంలో బైక్‌లో పెట్రోల్‌ వాడేటప్పుడు పశ్చిమాసియా యుద్ధం గుర్తుకొస్తుందని నిపుణులు అంటున్నారు. ఎన్నాళ్లుంటుందో తెలియని యుద్ధం మన మదుపు, పొదుపులనూ శాసిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఆయుధాల యుద్ధం ఆగినా… అది సృష్టించే ఆర్థిక విధ్వంసం తాలూకు ప్రభావం చాన్నాళ్లు వెంటాడుతాయని సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>