Mobile Popup Ad
Mobile Popup Ad

హరీశ్ దిక్కుమాలిన సలహాలతోనే కేసీఆర్ ఓటమి: రేవంత్

కలం, వెబ్ డెస్క్: హరీశ్‌రావు ఇచ్చిన దిక్కుమాలిన సలహాల వల్లే కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. ఇప్పుడు హరీశ్‌రావు నీటిపారుదల రంగానికి సంబంధించి తమకు సలహాలు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోహెడ బహిరంగసభలో రేవంత్ రెడ్డి  హరీశ్‌రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్‌రావు అడ్డమైన సలహాలవల్లే కాళేశ్వరం.. కూలేశ్వరం అయ్యిందని మండిపడ్డారు. మామ కేసీఆర్ నడుములు విరిగి ఫామ్‌హౌస్‌కు పరిమితం అయ్యారని పేర్కొన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్

కోహెడలోని ఫ్రూట్‌మార్కెట్‌ను అంర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా చెప్పుకుంటే సరిపోదని.. ఆ స్థాయిలో ప్రమాణాలు కూడా ఉండాలని పేర్కొన్నారు. అందుకే అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్‌ను నిర్మిస్తున్నామన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను కూడా స్టార్ హోటళ్ల స్థాయిలో నిర్మిస్తున్నామని చెప్పారు. 240 ఎకరాల్లో రూ. 2400 కోట్లు వెచ్చించి కోహెడ ఫ్రూట్ మార్కెట్ ప్రారంభించుకుంటున్నామని చెప్పారు. శంషాబాద్‌లో అంతర్జాతీయ ఎయిర్ పోర్టు‌కు గుర్తింపు వచ్చినట్టే కోహెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు గుర్తింపు దక్కుతుందని ఆకాంక్షించారు.

కారు ఫామ్ హౌస్‌కే పరిమితం

కారు ఇక ఫామ్‌హౌస్‌కు పరిమితం కాక తప్పదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ పతనం కాక తప్పదని పేర్కొన్నారు. అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో డొక్కు కార్లు ఉన్నట్టే.. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంబాసిడర్ కారు కూడా ఫామ్ హౌస్ దాటి బయటకు రాలేదని కామెంట్ చేశారు.

ఫ్యూచర్ సిటీకి అడ్డంకులు

ఫ్యూచర్ సిటీకి బీఆర్ఎస్ నేతలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కచ్చితంగా 2034 వరకు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంటుందని.. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీలు పెట్టి కాలుష్యభరితం చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం భావించిందని చెప్పారు. కానీ తాను మాత్రం హైటెక్ సిటీ తరహాలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు. రిజినల్ రింగు రోడ్డు, రీజినల్ రైలు తీసుకొస్తానని చెప్పారు. హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎకరం వందలకోట్ల ధర పలుకుతోందని.. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీలోనూ అదే పరిస్థితి వస్తుందని చెప్పారు.

కాళేశ్వరంతో సంబంధం లేకుండా ధాన్యం ఉత్పత్తి

బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ పంటలు పండినా కాళేశ్వరం వల్లే అని కేసీఆర్ ప్రచారం చేసేవారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం కాళేశ్వరం.. కూలేశ్వరం అయినప్పటికీ పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు చెప్పిందంతా అబద్ధమని తేలిపోయిందన్నారు. దేశంలో 60 శాతం ధాన్యం ఉత్పత్తి తెలంగాణ నుంచే అవుతోందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేద్దామన్నా.. మహారాష్ట్రతో చర్చించి తమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టాలని తలపెట్టినా బీఆర్ఎస్ పార్టీ అడుడగునా అడ్డం పడుతోందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అరిచిపెడబొబ్బలు పెట్టినా.. మూసీ నదిలో పందుల్లా పొర్లినా తాము మాత్రం చేయాల్సిన అభివృద్ధిని చేసి తీరుతామని చెప్పారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు.

కేంద్రం సహకరించం లేదు

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రాభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. పైగా తప్పుడు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. తాను ఢిల్లీలో ఉన్న ప్రధాని  మోడీకి కూడా భయపడబోనని పేర్కొన్నారు. కచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి రాష్ట్రాభివృద్దికి కావాల్సిన నిధులను తీసుకొస్తానని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>