కలం, తెలంగాణ బ్యూరో : రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం ఆరు నెలలు అదనంగా కొనసాగనున్నదా?.. 2028 డిసెంబరులో రావాల్సిన అసెంబ్లీ (Telangana Assembly) ఎన్నికలు ఆరు నెలలు ఆలస్యంగా వస్తాయా?.. పార్లమెంటు ఎన్నికలతో కలిపే జమిలి ఎన్నికలు జరుగుతాయా?.. ‘వన్ నేషన్ – వన ఎలక్షన్’ (One Nation – One Election) పాలసీలో భాగంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిపే ఉంటాయా?.. ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సీఎం రేవంత్‌రెడ్డి నుంచి ‘ఔను’ అనే సమాధానమే వస్తున్నది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తులో భాగంగా తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు కలిపే జరుగుతాయని మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ఐదేండ్లు ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో అరు నెలల పాటు ఎక్స్ టెండ్ అయ్యే అవకాశాలున్నాయన్నది ఆయన భావన. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కసరత్తు అంతా ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కావచ్చనే డైరెక్షన్‌లో ఉన్నట్లు వివరించారు.
జమిలితో పాటు మహిళా రిజర్వేషన్ సైతం :
కేంద్ర ప్రభుత్వం ఆలోచన మేరకు రిజిస్ట్రార్ జనరల్ (Census Registrar General) రూపొందించిన జనగణన షెడ్యూలు, సెకండ్ ఫేజ్‌లో జరిగే కులగణన, ఆ తర్వాత చేపట్టాల్సిన పార్లమెంటు నియోజకవర్గాల డీలిమిటేషన్ (Delimitation), ఇప్పటికే ఆమోదించిన మహిళా రిజర్వేషన్ (Women Reservation) బిల్లు.. ఇవన్నీ జమిలి ఎన్నికల నిర్వహణ కోసమేననే అభిప్రాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి వీలుగా ఇప్పటికే అన్ని పార్టీల అభిప్రాయాలను కేంద్ర ఎన్నికల సంఘం (Election Comission of India) సేకరించింది. ఏయే అసెంబ్లీ పదవీకాలం ఎప్పుడు ముగియనున్నది.. జమిలి ఎన్నికల పాలసీలో భాగంగా ఆయా అసెంబ్లీల గడువును పరిగణనలోకి తీసుకుని అసెంబ్లీ ఎన్నికలను ఎప్పుడు నిర్వహించే అవకాశమున్నది.. వీటన్నింటిపైనా ప్రాథమిక స్థాయిలో ఇప్పటికే కసరత్తు పూర్తయింది.
జనాభా లెక్కల తర్వాతే డీలిమిటేషన్ :
పార్లమెంటు నియోజకవర్గాలను డీలిమిటేషన్ చేయడంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లోతుగా చర్చించింది. తొలుత జనాభా లెక్కల సంఖ్య తేలితే దానికి అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘంతో చర్చలు జరిపి, ఆ తర్వాత డీలిమిటేషన్ కోసం ఒక కమిషన్‌ను నియమించడం చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గాల సరిహద్దులు, ఒక్కో నియోజకవర్గంలో ఎంత మంది జనాభా ఉన్నది.. ఇలాంటి వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి ఒక స్పష్టతకు వస్తుంది. అది పూర్తయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలను పెంచవచ్చో, దానికి ఏ ఫార్ములా అనుసరించాలో క్లారిటీ రానున్నది. ఈ ప్రక్రియ కోసం పట్టే సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పాలసీని 2029 పార్లమెంటు ఎన్నికల నుంచే అమలు చేయవచ్చన్న సంకేతాలతో సీఎం రేవంత్ (Revanth Reddy) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయన్న అంచనాకు వచ్చారు.
కేసీఆర్ నిర్ణయంతో తగ్గిన పదవీకాలం :
రాష్ట్రం ఏర్పడే సమయానికి తెలంగాణకు పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ తర్వాత షెడ్యూలు ప్రకారం 2019 ఏప్రిల్-మే నెలల్లోనే తెలంగాణకు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నది. కానీ పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా జరపడం ద్వారా ఒకదాని గెలుపు ప్రభావం మరోదానిపై ఉంటుందేన ఉద్దేశంతో అసెంబ్లీని 2018 సెప్టెంబరులోనే రద్దు చేశారు. దీంతో మూడు నెలల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 2018 డిసెంబరులో జరిగాయి. ఆ రకంగా తొలి టర్ములో ఐదేండ్ల పాటు కొనసాగాల్సిన బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఆరు నెలల ముందుగానే వైదొలగాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ (KCR) ఐదేండ్ల పదవీకాలం నాలుగున్నరేండ్లకే తగ్గిపోయింది. రెండో టర్ము లెక్కలకు అనుగుణంగా 2023 డిసెంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అదే క్రమం 2028 డిసెంబరులోనూ అమల్లోకి రావాల్సి ఉంటుంది. కానీ కేంద్రం జమిలి ఎన్నికల పాలసీ తీసుకుంటే ఆరు నెలలు ఆలస్యంగా (అంటే 2029 ఏప్రిల్-మే నెలల్లో) పార్లమెంటు, అసెంబ్లీకి కలిపి ఎన్నికలు జరిగే అవకాశమున్నది.
Read Also: ఓం బిర్లా పై అవిశ్వాస బాంబు.. చరిత్ర ఏం చెబుతోంది?
Follow Us On: Sharechat


