కలం, వెబ్ డెస్క్: లక్నోకు చెందిన 57 సంవత్సరాల అశోక్ బహార్ (Ashok Bahar) దేశంలోనే కఠినమైన వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ (NEET) రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా 17 నుంచి 25 ఏళ్లలోపు యువత పరీక్షలు రాస్తుంటారు. కానీ ఇటీవల జరిగిన నీట్ పరీక్ష రాశాడు. ఓ ఎరువుల సంస్థలో మార్కెటింగ్ హెడ్‌గా పనిచేసిన ఆయన, 2000లోనే స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్నారు. దశాబ్దాల తర్వాత ఆయన మళ్లీ పరీక్షా హాల్‌లోకి అడుగుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.
వైద్య రంగంపై ఉన్న సుదీర్ఘ ఆసక్తి వల్లే తాను ఈ వయసులో పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నట్లు అశోక్ బహార్ తెలిపారు. ఆయన భార్య డాక్టర్ మంజుల్ బహార్ ప్రస్తుతం అమెరికాలో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు. కుటుంబంలో వైద్య వాతావరణం ఉండటం వల్ల మందుల గురించి కొంత అవగాహన ఉంది. అయితే అధికారిక డిగ్రీ లేకుండా రోగులకు చికిత్స చేయడం సాధ్యం కాదు కాబట్టే నీట్ రాయాలని నిశ్చయించుకున్నట్లు వివరించారు. సమాజానికి సేవ చేయాలంటే సరైన శిక్షణ, గుర్తింపు పొందిన అర్హత అవసరమని ఆయన అన్నాడు.
చాలాకాలం తర్వాత చదువు ప్రారంభించడం కొంత కష్టమైనప్పటికీ, క్రమశిక్షణ, ఏకాగ్రత ఉంటే ఏదైనా సాధ్యమేనని అశోక్ బహార్ నిరూపించారు. పరీక్షా కేంద్రంలో అధికారుల నుంచి ఆయనకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లభించలేదు. సాధారణ అభ్యర్థులలాగే పరీక్ష రాశారు. ‘లక్ష్యం స్పష్టంగా ఉండి, కష్టపడే మనస్తత్వం ఉంటే ఏ దశలోనైనా ముందుకు సాగవచ్చు’ అని ఆయన యువతకు మెసేజ్ ఇచ్చారు.

