రోశయ్యను స్మరించుకున్న సీఎం రేవంత్‌.. ఆర్యవైశ్యులపై ప్రశంసలు!

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ఆర్యవైశ్య సమాజంతో తనకున్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్‌ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఆర్యవైశ్యులు సౌమ్య స్వభావంతో పాటు ఆత్మాభిమానం కలిగినవారని సీఎం కొనియాడారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా తమ బాధలను బయటకు చెప్పకుండా కుటుంబాలను ముందుకు తీసుకెళ్లే లక్షణం వారిలో ఉందని పేర్కొన్నారు. ఎంత పేద కోమటి దగ్గరైనా కోడి గుడ్డంతైన బంగారం ఉంటుందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. వందల, వేల సంవత్సరాల కిందే బంగారం ధరలు పెరుగుతాయని కోమటి వాళ్లు గుర్తించారని సీఎం అన్నారు.

రోశయ్యతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సీఎం

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని రేవంత్‌ రెడ్డి గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో తాను దూకుడుగా వ్యవహరిస్తున్న సమయంలో ఆవేశాన్ని తగ్గించుకోవాలని రోశయ్య సూచించేవారని చెప్పారు. ఆవేశానికి ఆలోచన తోడైతే రాజకీయ భవిష్యత్‌ మెరుగ్గా ఉంటుందని ఆయన ఇచ్చిన సలహాను సీఎం ప్రస్తావించారు. రోశయ్య ఎవరినైనా విమర్శించేవారు కానీ వ్యక్తిగతంగా దూషించేవారు కాదని రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌తో రోశయ్యకు ప్రత్యేక అనుబంధం ఉందని పేర్కొంటూ, నగరంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉందంటే దానికి కారణం రోశయ్య అని సీఎం తెలిపారు.

పొట్టి శ్రీరాములు సేవలను ప్రస్తావించిన సీఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏర్పాటు విషయంలో పొట్టి శ్రీరాములు చేసిన పోరాటాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. మద్రాస్‌ రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటంలో ఆయన త్యాగం కీలకమని అన్నారు. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను గుర్తుచేశారు. తెలంగాణ ఆర్థికంగా బలమైన రాష్ట్రంగా ఎదగడంలో ఆర్యవైశ్యుల వంటి వ్యాపార వర్గాల కృషి కూడా ఉందని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పేదలకు ఆర్థికంగా సహాయం చేయడంలో ఆర్యవైశ్యులు ముందుంటారని ప్రశంసించారు. సమాజ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>