కలం, పెద్దపల్లి: ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలను కరువు జిల్లాలుగా ప్రకటించిన ప్రభుత్వం పెద్దపల్లి జిల్లాను ఎందుకు కరువు జిల్లాగా ప్రకటించలేదో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ (Putta Madhukar) డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం మంథని మండలం మైదుపల్లి శివారులో ఎండిపోయిన వరి పొలాన్ని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకపోవడానికి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధరే కారణమని ఆరోపించారు. కరెంటు, నీళ్లు లేక పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతుంటే మంత్రి రైతుల గురించి నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇటీవల ముత్తారం మండలంలో ఓ రైతు ఎండిన పొలాన్ని చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేయగా, మరికొందరు రైతులు విద్యుత్ సరఫరా సరిగా లేక కరెంటు తీగలపై బట్టలు ఆరవేసి నిరసన తెలిపారని గుర్తు చేశారు.
లద్నాపూర్లో జరిగిన కార్యక్రమంలో పదేళ్లలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని శ్రీధర్ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. గత పదేళ్లలో ఒక్క గుంట భూమి ఎండిపోయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్, సాగునీరు అందించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు నివేదికలు ఇప్పించి పెద్దపల్లి జిల్లాను కరువు జాబితాలో చేర్చకుండా చేశారని ఆరోపించారు. కరువు జిల్లాగా ప్రకటిస్తే రైతులకు పరిహారం అందించాల్సి వస్తుందని, అందుకే రైతులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని హితవు పలికారు.
ప్రస్తుతం కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉందని, నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో పది ఎకరాల్లో సాగు చేసిన పంటలో రెండు ఎకరాల వరకు ఎండిపోతున్నాయని తెలిపారు. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి ఉంటే రెండు, మూడు ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకైనా పరిహారం అందేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం ప్రజలు చెల్లించిన పన్నుల నుంచే వస్తుందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించకుండా చేసిన విషయాన్ని రైతులు, ప్రజలు గమనించాలని పుట్ట మధూకర్ కోరారు. ఇప్పటికైనా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ రైతులకు క్షమాపణ చెప్పి, పెద్దపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

