కలం, ఖమ్మం బ్యూరో: ఒకే గర్భం.. ఒక్క రోజే వ్యవధి.. కానీ ప్రసవాలు జరిగిన తీరు, ఆసుపత్రులు మాత్రం వేర్వేరు! . ఒకే తల్లికి ఒకే రోజున ఒక బిడ్డ నార్మల్ డెలివరీ ద్వారా, మరొక బిడ్డ అత్యవసర సిజేరియన్ ద్వారా జన్మించిన (Twins Normal C Section) అరుదైన ఘటనను చూసి స్వయంగా వైద్యులే ఆశ్చర్యపోయారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో చోటుచేసుకున్న ఈ అరుదైన వైద్య అద్భుతం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మణుగూరు మండలం పగిడేరు గ్రామానికి చెందిన భీమమ్మ అనే గర్భిణి ప్రసవ నొప్పులతో మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరగా, వైద్యులు వెంటనే కాన్పు ప్రక్రియ ప్రారంభించారు. ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో మొదట సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) జరిగి, ఆమె ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, కడుపులో ఉన్న రెండవ బిడ్డ అడ్డం తిరగడంతో సాధారణ ప్రసవం సాధ్యపడలేదు. దానికితోడు భీమమ్మ తీవ్రమైన రక్తహీనత (ఎనీమియా)తో పాటు అధిక రక్తపోటు (బిపి) సమస్యతో బాధపడుతుండటంతో పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా మారింది.
పరిస్థితి తీవ్రతను గ్రహించిన మణుగూరు (Manuguru) ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమెను తక్షణమే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలంలో వేగంగా స్పందించిన వైద్య బృందం అత్యవసరంగా సిజేరియన్ ఆపరేషన్ నిర్వహించింది. వైద్యుల నిరంతర శ్రమ, సమయస్ఫూర్తి ఫలించి సిజేరియన్ ద్వారా పండంటి ఆడపిల్ల జన్మించింది.
ఒకే రోజు వ్యవధిలో రెండు వేర్వేరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒకే తల్లికి నార్మల్, సిజేరియన్ పద్ధతుల్లో కవల పిల్లలు జన్మించడం అత్యంత అరుదైన విషయమని వైద్యులు పేర్కొన్నారు. ప్రాణసంకటమైన పరిస్థితులు ఉన్నప్పటికీ సమయానికి సరైన వైద్య సహాయం అందడంతో ప్రస్తుతం తల్లి భీమమ్మతో పాటు నవజాత కవలలు క్షేమంగా ఉన్నారు. వైద్యుల ప్రతిభను, సమయస్ఫూర్తిని రోగి బంధువులతో పాటు స్థానికులు కొనియాడారు.
Also Read : రేవంత్ రెడ్డికి షాక్.. కొడంగల్‌లో బీఆర్ఎస్ బిగ్ ప్లాన్ !
Follow Us On: Instagram

