ఆలయ విమాన గోపుర నిర్మాణంపై బీజేపీ నిరసన

కలం, ​రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ (Vemulawada Temple) విమాన గోపురం నిర్మాణ పనులు ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. సంప్రదాయ ఆగమ శాస్త్ర నియమాలకు విరుద్ధంగా రాతి కట్టడాల స్థానంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆలయ ప్రధాన ద్వారం ఎదుట ఆందోళనకు దిగారు. ​తొలుత శాంతియుతంగా ప్రారంభమైన బీజేపీ శ్రేణుల నిరసన క్రమంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు ఆలయ ప్రధాన గేటును తోసుకుని లోపలికి వెళ్లేందుకు, గేటును ధ్వంసం చేసేందుకు యత్నించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆలయ ఆవరణలో ఉద్రిక్తతకు కారణమైన నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ​ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందువుల మనోభావాలు, ఆచార వ్యవహారాలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. పురాతన, సంప్రదాయబద్ధమైన రాతి కట్టడాలతో నిర్మించాల్సిన ఆలయ విమాన గోపురాన్ని కాంక్రీట్ కట్టడంగా మార్చడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా సంప్రదాయ రీతిలోనే నిర్మాణాలు చేపట్టాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>