కలం, వెబ్డెస్క్: ఏపీలో సంచలనం సృష్టించిన రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో దాడి ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలిక (Rapthadu School Girl) ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ గుడ్న్యూస్ చెప్పారు. బాలిక ఆరోగ్యం కుదుటపడుతోందని వెల్లడించారు. ప్రస్తుతం చాలా మేరకు ఆమె ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. ఈ మేరకు మంత్రి లోకేశ్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో బాధిత బాలికకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మంగళవారం బాలికను పర్యవేక్షిస్తున్న వైద్య బృందం బాలికతో ఆస్పత్రిలో కేక్ కట్ చేయించారు.
ఆమె కోలుకున్న సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ వైద్య బృందం కొన్ని ఫోటోలు విడుదల చేశారు. ఈ ఫోటోలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోల్లో స్వయంగా బాలిక కేక్ చేసి డాక్టర్లకు, తన తల్లిదండ్రులకు కేక్ తినిపించింది. బాలిక మరింత వేగంగా, పూర్తిగా కోలుకోవాలని డాక్టర్లు, మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. బాధితురాలి కోసం కేక్ కట్ చేసి, మ్యూజికల్ సెషన్ ఏర్పాటు చేసిన డాక్టర్లను మంత్రి లోకేశ్ అభినందించారు. రాప్తాడులో జరిగిన ఈ దాడి ఘటన సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. దీంతో అందరూ బాలిక ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇక తాజాగా విడుదలైన ఫోటోలతో బాలిక ఆరోగ్యం కుదుటపడిందని తెలిసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

