కలం, మహబూబ్ నగర్ బ్యూరో: లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం ‘ఛలో ఢిల్లీ’ (CITU Delhi Protest) కి బయలుదేరినట్లు మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా నుండి 52 మంది ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, కార్మికులకు వ్యతిరేకంగా లేబర్ కోడ్‌లు తీసుకువచ్చి, పోరాడే హక్కును, సమ్మె హక్కును, ఆందోళన హక్కును నిర్వీర్య పరిచిందని ఆయన ఆరోపించారు.
కనీస వేతనాల ప్రకారంగా 42,000 ఇవ్వకుండా, చాలీచాలని వేతనాలు ఇస్తూ కార్మికుల శ్రమను దోచుకుంటున్నారని ఆరోపించారు. పెట్టుబడిదారులు, కార్పోరేట్ల సంపద వేల కోట్లకు చేరుకొని కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంపదను వికేంద్రీకరించి కార్మికులకు కనీస సౌకర్యాలు, వేతనాలు, ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం, సమానత్వం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే, ప్రతి కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, పెన్షన్ సౌకర్యాలతో పాటు గృహ వసతి, ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో తలపెట్టిన ఢిల్లీ ఆక్యుపై నిరసన కార్యక్రమానికి జిల్లా నుండి 52 మంది కార్మికులు తరలి వెళ్లినట్లు వారు తెలిపారు. వీరిలో సీఐటీయూ జిల్లా నాయకులు తెలుగు సత్తయ్య, గోనెల రాములు, రాజకుమార్, గంజి వెంకన్న బాలయ్య వెంకట రాములు లక్ష్మి, పరమటి రాజు, తదితరులు ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారని తెలిపారు.

