Mobile Popup Ad
Mobile Popup Ad

బీజేపీ నిరసనలు.. రామ్‌చందర్ రావు హౌస్ అరెస్ట్

కలం, వెబ్ డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్ రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకుంటోందని బీజేపీ పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం ముట్టడికి రాంచందర్ రావు (Ramchander Rao) పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సీఎం ఇంటి ముట్టడికి యత్నిస్తుండగా బీజేపీ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు సమాచారంతోనే నేతల ఇంటికి చేరుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు రామ్ చందర్ రావును ఇంటి వద్దే గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడుతూ.. ఎన్ని నిర్బంధాలు చేసినా, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ పోరు ఆగదని హెచ్చరించారు. దేశంలో మహిళల అభివృద్ధిని కాంగ్రెస్ అడ్డుకుంటుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ దేశాన్ని అగ్రపథాన నడిపించడానికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. కీలక బిల్లులను అడ్డుకున్న కాంగ్రెస్ వైఖరిని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని అన్నారు.

నారీశక్తి ఆగ్రహాన్ని అణచివేయలేరు..

‘అక్రమ గృహనిర్బంధాలతో మహిళల ఆగ్రహాన్ని అణచివేయవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటే, అంతకంటే పొరపాటు మరొకటి లేదు. ప్రధాని మోదీ చిత్తశుద్ధితో కూడిన మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్, INDI కూటమి తమ మహిళా వ్యతిరేక నైజాన్ని మరోసారి బట్టబయలు చేశాయి. ఈ చారిత్రక ద్రోహం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళా లోకం తీవ్ర ఆగ్రహజ్వాలలతో రగిలిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ఈ పితృస్వామ్య, మహిళా వ్యతిరేక ధోరణికి నిరసనగా ఈరోజు ముఖ్యమంత్రి నివాస ముట్టడికి నేను పిలుపునిచ్చిన నేపథ్యంలో.. ఆ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు నన్ను నా నివాసంలోనే అక్రమంగా గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది నా స్పష్టమైన హెచ్చరిక. మీరు ఎంతటి పోలీసు నిర్బంధాలకు పాల్పడినా, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా నారీశక్తి ఆగ్రహాన్ని, వారి హక్కుల సాధనను మీరెన్నటికీ అణచివేయలేరు’ అని రామ్ చందర్ రావు పేర్కొన్నారు.

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ కాకపోవడంతో శనివారం నిరసనలకు బీజేపీ అధిష్టానం పిలుపునిచ్చింది. కేంద్రం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగసవరణ బిల్లును లోక్‌సభలో వీగిన విషయం తెలిసిందే. మహిళా బిల్లు వీగిపోవడానికి కాంగ్రెస్, విపక్షాలే కారణమని అధికార బీజేపీ ఆరోపిస్తోంది. విపక్షాల తీరుకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. డీలిమిటేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తూ బిల్లు వీగిపోయేలా చేశారని ఆరోపించింది. దేశంలో మహిళా సాధికారత సాధించడం కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు ఇష్టం లేదని మండిపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>