కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad Airport) లో ఇండిగో (IndiGo Flight) ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి కొచ్చి వెళ్లాల్సిన 6E 6684 నంబర్ గల విమానం సాంకేతిక కారణాలతో గంటల కొద్దీ ఆలస్యమవడమే కాకుండా, కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఈ విమానం శుక్రవారం సాయంత్రం 6:35 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, సుమారు మూడున్నర గంటల ఆలస్యంగా రాత్రి 10:05 గంటలకు కదిలింది. ఇండిగో విమానం (IndiGo Flight) లోపల ఏసీ వ్యవస్థ పూర్తిగా పనిచేయకపోవడంతో ప్రయాణికులు గాలి అందక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోతను తట్టుకోలేక చేతిలో ఉన్న పేపర్లతో విసురుకుంటూ కనిపించారు. గంటల తరబడి వేచి చూసినా సిబ్బంది నుంచి సరైన స్పందన లేకపోవడంతో ప్రయాణికులు ఇండిగో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థల నిర్లక్ష్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వెళ్లడించారు.

