Mobile Popup Ad
Mobile Popup Ad

భర్తను కోల్పోయినా.. ‘చేయూత’ అందలేదు!

కలం, ఖమ్మం బ్యూరో: పేదలు, ఒంటరి మహిళలు, వితంతువులను ఆదుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ పథకం కొందరు అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా దారి తప్పుతోంది. అందుకు ఉదహరణే ఖమ్మం (Khammam) రూరల్ మండలం తనగంపాడు గ్రామంలో సీతమ్మ ఉదంతం. మూడేళ్లుగా ఆమెకు రావాల్సిన పింఛన్ సొమ్ము మరొకరి ఖాతాలో జమవుతుండటం గమనార్హం.

మరొకరి ఖాతాల్లోకి డబ్బులు..

​సీతమ్మకు 2023లో ప్రభుత్వం వితంతు పింఛన్‌ను మంజూరు చేసింది. భర్తను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమెకు ఈ పింఛన్ పెద్ద ఆసరాగా మారుతుందని భావించింది. ఏమైందో ఏమో తెలియదు.. పింఛన్ మంజూరైనా ఆమెకు నేటికీ రూపాయి అందలేదు. ప్రభుత్వం నుంచి ప్రతి నెలా డబ్బులు విడుదలవుతున్నా, అవి సీతమ్మ బ్యాంకు ఖాతాకు కాకుండా వేరొకరి బ్యాంకు ఖాతాలోకి వెళ్తూనే ఉన్నాయి.

మూడేళ్లుగా ఆ వృద్ధురాలు ప్రభుత్వ సాయానికి దూరమై, కనీస అవసరాలు తీరక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ​తన ఖాతాలో డబ్బులు పడటం లేదని బాధితురాలు గతంలోనే పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఎవరూ స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

అధికారుల తనిఖీల్లో బయటకు..

ఇటీవల ప్రభుత్వం చేపట్టిన చేయూత పింఛన్ల భౌతిక వెరిఫికేషన్ ప్రక్రియలో ఈ విషయం వెలుగులోకి తెచ్చింది. అధికారులు రికార్డులు, లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా… సీతమ్మ పేరుపై పింఛన్ మంజూరై డబ్బులు వస్తున్నా.. బ్యాంకు ఖాతా నెంబర్ మాత్రం మరొకరిదిగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పొరపాటా.. కావాలనే చేశారా..

దీంతో బాధితురాలు షాక్ అవ్వగా.. పెద్ద పొరపాటని అధికారులు గుర్తించారు. గతంలో గ్రామంలో పనిచేసిన అధికారి పాత్రపై అనుమానాలు, ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసేటప్పుడు జరిగిన సాంకేతిక పొరపాటా, లేక కావాలనే లబ్ధిదారు ఖాతా స్థానంలో తమకు అనుకూలమైన వారి ఖాతా నెంబర్ చేర్చారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విచారణ జరిపించాలని డిమాండ్..

ఒక్క సీతమ్మ సమస్యే కాకపోవచ్చని, లోతుగా విచారిస్తే ఇలాంటి అక్రమాలు మరికొన్ని వెలుగు చూసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని, లబ్ధిదారుల వివరాలను తారుమారు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. మూడేళ్లుగా మరొకరి ఖాతాలోకి వెళ్లిన పింఛన్ సొమ్మును పూర్తిగా రికవరీ చేసి, బాధితురాలికి అందించి సీతమ్మకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>