రామగుండంలో సెల్‌ఫోన్ రికవరీ మేళా

కలం, పెద్దపల్లి: సెల్‌ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా ప్రజలు వెంటనే కేంద్ర ప్రభుత్వ ‘సీఈఐఆర్’ (CEIR) పోర్టల్‌ను సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన ‘సెల్‌ఫోన్ రికవరీ మేళా’లో(Cellphone Recovery Mela) సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు రికవరీ చేసిన సుమారు రూ.27.40 లక్షల విలువైన 142 సెల్‌ఫోన్లను సీపీ అంబర్ కిషోర్ ఝా బాధితులకు అందజేశారు.

3,717 సెల్‌ఫోన్ల రికవరీ

రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇప్పటివరకు CEIR పోర్టల్ ద్వారా 10,420 ఫిర్యాదులు నమోదు కాగా, పోలీసులు  ప్రత్యేకంగా శ్రమించి 3,717 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని వాటి యజమానులకు అప్పగించినట్లు సీపీ తెలిపారు. పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల ఆచూకీ కోసం సీసీఎస్‌తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక బృందాలను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. పోలీసులు, సీసీఎస్, ఐటీ సెల్ బృందాల సమన్వయంతో ఫోన్ల రికవరీకి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

IMEI బ్లాక్ చేస్తే రికవరీ సులభం

ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని సీపీ సూచించారు. దీంతో పోయిన ఫోన్‌ను ఇతర నెట్‌వర్క్‌లలో లేదా ఇతర రాష్ట్రాలలో ఉపయోగించకుండా నిరోధించవచ్చని, ఫోన్ ఆచూకీ గుర్తించి రికవరీ చేయడం సులభమవుతుందని వివరించారు. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ చెల్లింపులు, ఆన్‌లైన్ లావాదేవీలకు మొబైల్ ఫోన్ అత్యంత కీలకంగా మారిందని అన్నారు. అందువల్ల ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్‌లో సమాచారం ఇవ్వడంతో పాటు CEIR పోర్టల్‌ను వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, ఎస్‌ఐలు జీవన్, చంద్రశేఖర్, నసీర్, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>