వర్షాల కోసం మహిళల ప్రత్యేక పూజలు.. నిర్మల్‌లో ‘అల్లు పట్టుడు’ కార్యక్రమం

కలం, నిర్మల్: మృగశిర కార్తె ప్రారంభమై నెలన్నర రోజులు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలాలు వర్షం కోసం ఎదురు చూస్తుండగా, చెరువులు, కుంటలు నీరులేక వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకృతిని ప్రసన్నం చేసుకుని వర్షాలు కురవాలని కోరుతూ నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని బేస్తవారిపేట్ కాలనీలో మహిళలు సంప్రదాయ ‘అల్లు పట్టుడు’ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

గ్రామీణ సంస్కృతిలో భాగమైన ఈ ఆచారంలో మహిళలు ఒకచోట చేరి నేలపై బియ్యం పోసి, పూజా సామగ్రితో కలశాన్ని అలంకరించారు. బిందెలో నీటిని నింపి పూలతో అలంకరించి “వానలు కురవాలి.. పంటలు పండాలి.. రైతన్న ముఖంలో చిరునవ్వు విరియాలి” అంటూ భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. పూజల సందర్భంగా కలశం (బిందె) చుట్టూ మహిళలు పాటలు పాడుతుండగా, బిందె స్వయంగా తిరిగినట్లు కనిపించడంతో అక్కడున్న మహిళలు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేశారు. మంచి వర్షాలు కురుస్తాయనే శుభసూచకంగా భావించి హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం మహిళలందరూ బిందెలోని పవిత్ర జలాన్ని తీసుకుని భక్తి గీతాలు పాడుతూ ఊరేగింపుగా హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. అక్కడ అంజనేయస్వామికి అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసి, జిల్లా వ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగాలని ప్రార్థించారు. ప్రస్తుతం వర్షాభావంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న వేళ, మహిళలు నిర్వహించిన ఈ సంప్రదాయ ‘అల్లు పట్టుడు’ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>