కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక (Karnataka)లోని దక్షిణ కన్నడ జిల్లాలో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. బంట్లాల్ తాలూకా బీసీ రోడ్డు వద్ద ఉన్న కేఎస్‌ఆర్‌టీసీ బస్ స్టాండ్ (Bantwal KSRTC Bus Stand)లో పట్టపగలే అందరూ చూస్తుండగానే ఒక యువతి దారుణ హత్యకు గురైంది. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న 21 ఏళ్ల లావణ్య తన విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కింది. ఆ సమయంలో ఆమెను వెంబడిస్తూ వచ్చిన మాజీ ప్రియుడు, దూరపు బంధువైన చేతన్ (22) అనే యువకుడు ఒక్కసారిగా ఆమెను బస్సులోంచి కిందికి దించి, తన బ్యాగులో తెచ్చుకున్న కొడవలితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
లావణ్య ప్రాణభయంతో తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, నిందితుడు ఆమెను పలుమార్లు పొడిచాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా, చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాతే చేతన్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దృశ్యాలన్నీ బస్ స్టాండ్‌లోని సీసీటీవీ (CCTV) కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. అక్కడున్న స్థానికులు వెంటనే లావణ్యను బంట్లాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. లావణ్య, చేతన్ నాలుగేళ్ల క్రితమే ప్రేమ విఫలమవడంతో విడిపోయారు. అయినప్పటికీ చేతన్ ఆమెను నిరంతరం వేధిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో బెల్తంగడికి చెందిన చేతన్ ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బంట్లాల్ టౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

