కలం, వెబ్ డెస్క్: నాగర్‌కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తీసుకువచ్చిన మొక్కజొన్న, ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. చేతికొచ్చిన పంట కళ్లముందే నష్టపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ యార్డుల్లో సరైన గోదాములు, కవరింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమే:రైతులు
ప్రభుత్వం సకాలంలో మొక్కజొన్న, వడ్లు కొనుగోలు చేసి ఉంటే ఈ నష్టం తప్పేదని అంటున్నారు. “గత 15 రోజులుగా మార్కెట్ యార్డు చుట్టూ తిరుగుతున్నాం. కానీ మా పంటను ఎవరూ కొనలేదు. ఇప్పుడు వర్షం వచ్చి మొత్తం తడిసిపోయింది” అంటూ రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం, నిర్వాకమే తమను ఈ పరిస్థితికి నెట్టిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తడిసిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే తమకు భారీ ఆర్థిక నష్టం తప్పదని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే కొనుగోలు చర్యలు ప్రారంభించడంతో పాటు మార్కెట్ యార్డుల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
Read Also: ‘విమానాలు ఆపేస్తాం’.. ఎయిర్‌లైన్స్ సంస్థల హెచ్చరిక
Follow Us On : WhatsApp

