కలం, నల్గొండ : నగరంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా చేపట్టేందుకు నగరపాలక సంస్థ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోందని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం పారిశుద్ధ్య కార్మికుల హాజరు నమోదుకు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) , వాహనాల పనితీరు పర్యవేక్షణకు QR కోడ్ ఆధారిత (QR Codes) విధానాన్ని అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. FRS ద్వారా హాజరు నమోదు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది వివరాల్లో పారదర్శకత పెరుగుతుందని, పనుల నిర్వహణను మెరుగ్గా పర్యవేక్షించవచ్చని అన్నారు.
QR కోడ్ విధానం ద్వారా వాహనాల రాకపోకలు, చెత్త సేకరణ, డంపింగ్ వివరాలు, డీజిల్ వినియోగం, మరమ్మతుల అవసరాలను పర్యవేక్షించవచ్చన్నారు. దీనివల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ, ఆధునిక సాంకేతికతతో ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సేవలు అందిస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ, కమిషనర్ బి.వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

