కలం, వెబ్‌డెస్క్: బ్యాంకాక్ వేదికగా జరుగుతున్న థాయ్‌లాండ్ ఓపెన్ (Thailand Open) సూపర్ 500 టోర్నీలో భారత షట్లర్లు అదరగొడుతున్నారు. ఆరంభం నుంచే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. బుధవారం జరిగిన సింగిల్స్ మొదటి రౌండ్‌లో స్టార్ షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), లక్ష్య సేన్ (Lakshya Sen), కిడాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) తమ ప్రత్యర్థులపై వరుస సెట్లలో ఘన విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
రెండుసార్లు ఒలింపిక్ మెడల్ విజేత అయిన పీవీ సింధు, చైనీస్ తైపీకి చెందిన తుంగ్ సియు-టాంగ్‌ను 21-9, 21-12తో చిత్తు చేశారు. అలాగే గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చిన లక్ష్య సేన్, సింగపూర్‌కు చెందిన జియా హెంగ్‌పై 21-16, 21-17 తేడాతో విజయం సాధించారు. మాజీ నంబర్ వన్ కిడాంబి శ్రీకాంత్ కూడా అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి, ఎనిమిదో సీడ్‌లో కీన్ యూను కేవలం 30 నిమిషాల్లోనే ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరోవైపు యువ క్రీడాకారిణి దేవిక సిహాగ్ జపాన్‌కు చెందిన నట్సుకి నిదైరాపై గంటకు పైగా పోరాడి విజయం సాధించారు. మాళవిక బన్సోద్ కూడా కెనడా క్రీడాకారిణి వెన్ యు జాంగ్‌పై గెలిచి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు. అయితే తన్వీ శర్మకు మాత్రం మొదటి రౌండ్‌లో నిరాశే ఎదురైంది.
అంతేకాకుండా భారత యువ క్రీడాకారులు ఆయుష్ శెట్టి, తరుణ్ మన్నెపల్లి తమ ప్రత్యర్థులతో పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయారు. ఉన్నతి హూడా, అన్మోల్ ఖర్బ్ కూడా థాయిలాండ్, చైనా అగ్రశ్రేణి క్రీడాకారిణులతో హోరాహోరీగా తలపడ్డారు, కానీ చివరి నిమిషంలో పాయింట్లు కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించారు. మిశ్రమ డబుల్స్ విభాగంలో ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో జంటతో పాటు ఇతర భారత జంటలు కూడా మొదటి రౌండ్‌లోనే ఓడిపోయాయి.
రెండో రౌండ్‌లో పీవీ సింధు డెన్మార్క్‌కు చెందిన అమాలీ షుల్జ్‌తో, శ్రీకాంత్ చైనీస్ తైపీకి చెందిన సు లీ యాంగ్‌తో తలపడనున్నారు. భారత క్రీడాకారులు తమ తదుపరి మ్యాచ్‌లలో కూడా ఇదే జోరును కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు.

