కలం, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా మద్యం వినియోగంలో తెలంగాణ (Telangana)టాప్‌లో నిలిచింది. రాష్ట్రంలోని గ్రామాల్లో మద్యం ఏరులైపారుతోంది. విచ్చలవిడిగా వెలుస్తున్న బెల్ట్ షాపుల (Belt Shops) వల్ల గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పెరిగిపోయిందని ‘ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్’ (FGG) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై సదరు సంస్థ సీఎం రేవంత్ రెడ్డికి ఓ వినతి పత్రం సమర్పించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS) గణాంకాలను ప్రస్తావిస్తూ, రాష్ట్రంలోని పురుషుల్లో మద్యం అలవాటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా పట్టణాలతో పోలిస్తే గ్రామాల్లోనే దీని ప్రభావం తీవ్రంగా ఉందని పేర్కొంది.
15 ఏళ్ల నుంచే మద్యం
ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నివేదిక ప్రకారం తెలంగాణలో 15 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో 43.3 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు వెల్లడైంది. ఈ సగటు గ్రామీణ ప్రాంతాల్లో ఏకంగా 49 శాతంగా ఉండగా, పట్టణాల్లో 33.3 శాతంగా నమోదైంది. జాతీయ స్థాయిలో ఇదే వయస్సు గల పురుషులలో కేవలం 18.7 శాతం మంది మాత్రమే మద్యం సేవిస్తున్నట్లు తేలింది. ఈ గణాంకాల ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ తర్వాత దేశంలోనే అత్యధికంగా మద్యం సేవించే పురుషులున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది.
పేద కుటుంబాలపై తీవ్ర ప్రభావం
కొన్ని దశాబ్దాల క్రితం గ్రామాల్లో మద్యం లభ్యత చాలా పరిమితంగా ఉండేదని, కేవలం మండల కేంద్రాలకే అమ్మకాలు పరిమితమయ్యేవని ఎఫ్‌జీజీ గుర్తు చేసింది. కానీ, గ్రామాల్లో బెల్ట్ షాపుల విస్తరణ కారణంగా మద్యం నేరుగా నివాస ప్రాంతాలకూ, గడపగడపకూ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. బెల్ట్ షాపులే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం వినియోగం పెరగడానికి ప్రధాన కారణమని ఆ సంస్థ విశ్లేషించింది. కేవలం సర్వే గణాంకాలే కాకుండా గ్రామాల్లో మందు సులభంగా దొరకడం పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో అనధికారికంగా నడుస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

