నో డౌట్ బెంగాల్‌లో పవర్ మాదే: ప్రధాని మోదీ

కలం, వెబ్ డెస్క్: బెంగాల్ ప్రజలు కాంగ్రెస్‌, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్‌కు 70 ఏండ్లు అధికారం ఇచ్చారని అలాగే బీజేపీకి కూడా ఓ చాన్స్ ఇవ్వాలని ప్రధాని మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఈ సారి రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తాను మే 4 తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవానికే రాష్ట్రానికి వస్తానంటూ పేర్కొన్నారు. కోల్‌కతా సమీపంలోని బరాక్‌పూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార‌సభలో మోదీ ప్రసంగించారు. బీజేపీకి అవకాశం ఇస్తే పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామన్నారు.

బెంగాల్‌లో సిండికేట్ రాజ్

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో సిండికేట్ రాజ్ నడుస్తోందని మోదీ ఆరోపించారు. రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయిందని.. రాజకీయహింస పెరిగిపోయిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాటి నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. బరాక్‌పూర్ చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉందన్నారు. 1857 స్వాతంత్ర్య సమరంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా బెంగాల్‌లో రాజకీయ మార్పుకు ఇదే ప్రాంతం దారి చూపుతుందని వ్యాఖ్యానించారు. భారత దేశ అభివృద్ధికి పశ్చిమ బెంగాల్ పురోగతి ఎంతో అవసరమని ప్రధాని అన్నారు.“పశ్చిమ బెంగాల్‌కు సేవ చేయడం, రక్షించడం నా బాధ్యత” అని మోదీ  (Narendra Modi) స్పష్టం చేశారు.

పశ్చిమబెంగాల్‌లో కమలం వికసిస్తుంది

ఇటీవల ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతం అయిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈసారి బెంగాల్‌లో కూడా ‘కమలం వికసిస్తుంది’ అని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, మరోవైపు నేరగాళ్ల కార్యకలాపాలు పెరుగుతున్నాయని ప్రధాని ఆరోపించారు. “ఫ్యాక్టరీలు మూసుకుపోతుంటే బాంబుల తయారీ కేంద్రాలు పెరుగుతున్నాయి. గూండాలను ప్రోత్సహిస్తూ సిండికేట్ వ్యవస్థను విస్తరిస్తున్నారు” అంటూ మోదీ ఘాటు విమర్శలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి దిశగా ఎలాంటి దృష్టి లేదని, కేవలం విమర్శలు, బెదిరింపులు, అబద్ధ ప్రచారాలకే పరిమితమైందని ప్రధాని వ్యాఖ్యానించారు. రాజ్యాంగ సంస్థలు, సాయుధ దళాలపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేసే పార్టీలను ప్రజలు ఉపేక్షించొద్దని సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>