కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) నగరంలోని రోడ్లు, వంతెనల అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal) కోరారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని (Minister Komatireddy) కలిసి అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ ప్రాంతం, నాందేవాడ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) పొడిగింపు, అదనపు పనులకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. రైల్వే లైన్ దాటేందుకు ప్రస్తుతం విజయ థియేటర్, నాందేవాడ వంతెన వద్ద మాత్రమే రెండు మార్గాలు ఉన్నాయని, నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఎల్లమ్మగుట్ట వద్ద మరో రైల్వే రన్‌వే (రైల్వే మార్గం) ఏర్పాటు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.170 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.
అలాగే నిజామాబాద్‌లోని రేడియో స్టేషన్ నుంచి ముదక్పల్లి పాత జీపీ కార్యాలయం వరకు రూ.30 కోట్ల వ్యయంతో ఆర్అండ్బీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేసినట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్పల్లి, ఇందల్వాయి, భీమ్‌గల్ మీదుగా కమ్మర్పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవున కొత్త జాతీయ రహదారి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

