కలం, నిర్మల్: రాష్ట్రంలో దేవాదాయ శాఖ అమలు చేస్తున్న దీప ధూప నైవేద్య పథకానికి (Deepa Dhoopa Naivedyam) నిధులు పెంచడంతో పాటు అర్చకులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ డిమాండ్ చేశారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్ శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుదేవ శర్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ ఆలయాలలో ఏళ్లుగా దీప ధూప నైవేద్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న అర్చకులకు గౌరవ వేతనాలు పెంచి, ప్రతినెలా సక్రమంగా చెల్లించాలని కోరారు. ఆలయాలలో సేవలందిస్తున్న అర్చకులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
సేవా కార్యక్రమాలు
సమావేశానికి ముందు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు, కొండాపూర్‌లోని బాల సదనంలోని పిల్లలకు, దివ్యాంగులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ధూపదీప నైవేద్య అర్చక సంఘం నిర్మల్ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా తుపాకుల వెంకటరమణ, ఉపాధ్యక్షుడిగా మహాంతయ్య, కోశాధికారిగా అర్జున్, కార్యదర్శిగా మాధవ కృష్ణ, సహాయ కార్యదర్శిగా గోవిందయ్య ఎన్నికయ్యారు. గౌరవ సభ్యులుగా సంతోష్, లక్ష్మణ్‌ను ఎన్నుకున్నారు.

